Thummala: డిపాజిట్ రాని బీఆర్ఎస్‌ను బలోపేతం చేసింది నేను కాదా?... కేసీఆర్‌వి అన్నీ అబద్ధాలే!: తుమ్మల
- పాలేరు సభలో కేసీఆర్ అబద్దాలు చెప్పారని తుమ్మల ఆగ్రహం
- పువ్వాడ అజయ్ కుమార్‌ని పక్కన పెట్టుకొని నన్ను విమర్శిస్తారా? అని మండిపాటు
- సోనియా గాంధీకి మాట ఇచ్చి తప్పావంటూ కేసీఆర్‌పై విమర్శలు
- ప్రాజెక్టుల కోసమే తాను బీఆర్ఎస్‌లో చేరానని వెల్లడి
పాలేరు ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ అబద్ధాలే మాట్లాడారని, ఇది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ... 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒక్క కొత్తగూడెం మాత్రమే గెలిచిందని, దీంతో పార్టీ బలోపేతం కోసం నన్ను బతిమాలి పార్టీలో చేర్చుకోలేదా? అని ప్రశ్నించారు. నేను పార్టీలో చేరిన రోజున జిల్లా పరిషత్ చైర్మన్ డీసీఎంఎస్ చైర్మన్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు వందల మంది సర్పంచ్‌లు పార్టీలో చేరింది నిజంకాదా? డిపాజిట్లు రాని పార్టీని జిల్లాలో నేను బలోపేతం చేసింది నిజం కాదా? అని నిలదీశారు.
40 ఏళ్ల సహవాసంలో నా నిబద్ధత ఏమిటో కేసీఆర్‌కు తెలుసునన్నారు. అలాంటి మీరు పార్టీ మారిన పువ్వాడ అజయ్ కుమార్‌కు ప్రభుత్వ భూములు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డికు కాంట్రాక్ట్‌లు ఇచ్చి... వారిని పక్కన పెట్టుకొని నాపై విమర్శలు చేస్తారా? నేను పార్టీ మారితే మీరు చేసిన వ్యాఖ్యలు జిల్లా ప్రజానీకం అంతా చూస్తున్నారన్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు తాను ఎంతగానో రుణపడి ఉంటానని, ఇక్కడి ప్రజల కోసం మీ రాజకీయ విమర్శలను భరిస్తానన్నారు.
తెలంగాణ కల సాకారం చేసిన సోనియా గాంధీకి ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పారని, మానసిక దౌర్బల్యంతోనే కేసీఆర్ తనపై విమర్శలు చేశారన్నారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితం అంతా తెలిసి కూడా నీ స్వార్థం కోసం మాట్లాడతావా అని మండిపడ్డారు. తాను బీఆర్ఎస్‌లో చేరిన సమయంలో అక్కడకు వచ్చిన వారిని చూసి కేటీఆర్ అన్న వ్యాఖ్యలు గుర్తుకు లేవా? అన్నారు. మనం పార్టీ మారినా ఇంతమంది మనతో రారని కేటీఆర్ అనలేదా? తుమ్మలతో బీఆర్ఎస్ పార్టీలోకి ప్రభంజనంలా వచ్చి చేరారని చెప్పింది మర్చిపోయావా?
పదవుల కోసం కాదు సీతారామ, భక్త రామదాసు ప్రాజెక్టుల కోసమే తాను పార్టీలో చేరుతున్నట్లు ఆ రోజే చెప్పానన్నారు. భక్త రామదాసు ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో తనను అపర భగీరథుడని పొగిడిన పొగడ్తలు జిల్లా ప్రజానీకం చూశారని, పాలేరులో నా ఓటమికి నీ కుమారుడే కారణమన్న విషయం మీకు తెలుసు అన్నారు. మా కత్తితో మేమే పొడుచుకున్నామని మీరే మీడియా ముఖంగా చెప్పారు, ఎంపీ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గెలుపు కోసం, స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపులో నా పాత్ర లేదా? అని తుమ్మల ప్రశ్నించారు. ఓడిపోయి మూలన కూర్చుంటే మంత్రి పదవి ఇచ్చానని, పార్టీ కోసం చేసింది నేను సున్నా అని చవకబారు విమర్శలు చేస్తావా? అని ధ్వజమెత్తారు.