Cricket: వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ చెత్త రికార్డు.. చరిత్రలో తొలిసారి ఇలా!
- నిన్న దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన పాక్
- వరల్డ్ కప్‌లో తొలిసారి వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిన రికార్డు
- దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో సెమీస్ అవకాశాలు గల్లంతు
భారత్ వేదికగా జరగుతున్న వన్డే వరల్డ్ కప్ 2003లో పేలవ ప్రదర్శన చేస్తున్న పాకిస్థాన్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. థ్రిల్లింగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో కంగుతిన్న ఈ జట్టు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడినట్టయ్యింది. వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్థాన్ వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని ఆ టీమ్ ఎదుర్కోలేదు. దీంతో బాబర్ ఆజమ్ కెప్టెన్సీలోని ఆ జట్టు వరల్డ్ కప్‌లో వరుసగా నాలుగు ఓటముల చెత్త రికార్డును మూటగట్టుకుంది. చెన్నై వేదికగా శుక్రవారం దక్షిణాఫ్రికాపై ఓటమిపాలవ్వడంతో ఇది చోటుచేసుకుంది. అంతకుముందు భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ల చేతిలో వరుసగా ఓటములు చవిచూసిన విషయం తెలిసిందే.
కాగా తదుపరి మ్యాచుల్లో ఆ జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి. తన తర్వాతి మ్యాచ్ అక్టోబర్ 31న కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్‌పై జరగనుంది. తాజా ఓటమితో పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ మరింత కిందికి దిగజారింది. 6 మ్యాచ్‌ల్లో కేవలం 2 మాత్రమే గెలిచి 6వ స్థానానికి పరిమితమైంది. సెమీఫైనల్‌కు అర్హత సాధించడానికి అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత ఈ పరిస్థితి అనివార్యమైంది. కాగా శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కేవలం ఒక వికెట్ తేడాతో పాక్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించిన విషయం తెలిసిందే.