rape: ముస్లింలు వీటిల్లో ముందుంటారంటూ అసోం నేత వివాదాస్పద వ్యాఖ్యలు
- ముస్లింలలో నేరాల రేటు ఎక్కువగా ఉందన్న ఏఐయూడీఎఫ్ చీఫ్
- ఈ వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని ప్రకటన
- అక్షరాస్యత తగినంత లేకపోవడమే అనర్థాలకు కారణమన్న అభిప్రాయం
ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) చీఫ్ బబ్రుద్దీన్ అజ్మల్ తన వ్యాఖ్యలతో వివాదం రాజేశారు. ముస్లింలలో నేరాల రేటు మరీ ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. ‘‘మేము (మస్లింలు) దొపిడీ, దందాలు, దొంగతనం, అత్యాచారాల్లో నంబర్ 1గా ఉన్నాం. జైలుకు వెళ్లే విషయంలోనూ మేమే నంబర్ 1’’ అని అజ్మల్ వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రాగా, తాను చెప్పిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు బబ్రుద్దీన్ అజ్మల్ స్పష్టం చేశారు.
ముస్లింలలో నేరాల రేటు ఎక్కువన్న దానికి తాను కట్టుబడి ఉంటానని అజ్మల్ ప్రకటించారు. తానేమీ తప్పు చెప్పలేదన్నారు. నేరాల్లో ఎక్కువగా పాల్గొనడం వెనుక సరైన అక్షరాస్యత లేకపోవడమే కారణంగా పేర్కొన్నారు. అసోంలోని బెంగాలీ మాట్లాడే ముస్లింలలో ఏఐయూడీఎఫ్ కు మంచి పట్టు ఉంది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంలో అక్షరాస్యత తక్కువగా ఉంది. మన పిల్లలు చదువుకోవడం లేదని, ఉన్నత విద్య దిశగా అడుగులు వేయడం లేదని, కనీసం మెట్రిక్యులేషన్ కూడా పూర్తి చేయడం లేదన్న బాధను వ్యక్తం చేశాను. విద్య గురించి యువతకు చెప్పడం కోసమే నేను అలా వ్యాఖ్యానించాను’’ అని అజ్మల్ వివరించారు.
మహిళలను చూసి లైంగిక ఉద్రేకానికి లోను కావద్దని యువతను అజ్మల్ కోరారు. మహిళల పట్ల ప్రవర్తించే విషయంలో తగిన విధానం ఉందన్నారు. మహిళలను చూసినప్పుడు తమ తల్లులు, తోబుట్టువులను గుర్తు చేసుకోవాలన్నారు. ముస్లిం సమాజం అభివృద్ధి చెందకపోవడానికి అక్షరాస్యత రేటు తక్కువగా ఉండడమే కారణమని అభిప్రాయపడ్డారు.