Revanth Reddy: కేసీఆర్ ఓటమిని అంగీకరించాడు... వారి నుంచి అంతా కక్కిస్తాం: రేవంత్ రెడ్డి
- కేసీఆర్ ఓడిపోయాక మింగిన లక్ష కోట్లు, ఆక్రమించిన పదివేల ఎకరాలను కక్కిస్తామన్న రేవంత్
- హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి కారణం కాంగ్రెస్సేనన్న రేవంత్ రెడ్డి
- మాకు ఎంత మెజార్టీ ఇస్తారో మీ దయ... అంటూ రేవంత్ విజ్ఞప్తి
ముఖ్యమంత్రి కేసీఆర్ పరోక్షంగా తన ఓటమిని అంగీకరించారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ అక్రమాలను వెలికితీస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తాండూరులో నిర్వహించిన విజయభేరి యాత్రలో ఆయన మాట్లాడుతూ... మేం ఓడిపోతే మాకేం నష్టం లేదు, ప్రజలే నష్టపోతారని కేసీఆర్ ఇటీవల అన్నారని, ఫాంహౌస్లో విశ్రాంతి తీసుకుంటానని చెప్పారని, పరోక్షంగా ఆయన ఓటమిని అంగీకరించారన్నారు. కానీ కేసీఆర్ ఓడిపోయాక కాంగ్రెస్ ఊరుకోదని, పదేళ్లు అధికారంలో ఉండి మింగిన లక్ష కోట్లను, హైదరాబాద్లో ఆక్రమించిన పదివేల ఎకరాలను కక్కిస్తామన్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలోకి రాకుంటే రియాల్టీ దెబ్బతింటుందని చెబుతున్నారని, కానీ హైదరాబాద్ బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి చెందిందా? అని ప్రశ్నించారు. ఈ రోజు హైదరాబాద్ రియాల్టీ రంగంలో మొదటిస్థానంలో ఉందంటే కాంగ్రెస్ తెచ్చిన ఔటర్ రింగ్ రోడ్డు, కాంగ్రెస్ నిర్మించిన విమానాశ్రయమే కారణమన్నారు. ఐటీ పరిశ్రమలు రావడానికి కాంగ్రెస్ కారణమని చెప్పారు. హైదరాబాద్ పరిధిలో ఈ రోజు ఎకరం రూ.100 కోట్లు పలుకుతుందంటే అందుకు కాంగ్రెస్ కారణమన్నారు. శాంతిభద్రతలు, మతసామరస్యం కాపాడేది కాంగ్రెస్ అన్నారు.
మీ దయ కొడంగల్, తాండూరులో కాంగ్రెస్కు ఎంత మెజార్టీ ఇస్తారో? అని రేవంత్ సభకు వచ్చిన వారిని ఉద్దేశించి అన్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ 1.23 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారని, ఇక్కడ తమకు ఎంత మెజార్టీ వస్తుందనేది చూస్తామన్నారు. కార్యకర్తలు పట్టుదలతో పని చేయాలని పిలుపునిచ్చారు.