Team India: వరల్డ్ కప్ లో టీమిండియా సిక్సర్... ఇంగ్లండ్ ఘోర పరాజయం
- వరల్డ్ కప్ లో ఇవాళ టీమిండియా × ఇంగ్లండ్
- 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ను ఓడించిన టీమిండియా
- మొదట 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసిన రోహిత్ సేన
- 34.5 ఓవర్లలో 129 పరుగులకు కుప్పకూలిన ఇంగ్లండ్
- షమీకి 4, బుమ్రాకు 3 వికెట్లు
వరల్డ్ కప్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇవాళ ఇంగ్లండ్ జట్టును కూడా టీమిండియా అలవోకగా ఓడించింది. తద్వారా టోర్నీలో వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసుకుని సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది.
లక్నోలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. అయితే లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకు కుప్పకూలి, 100 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది.
టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ 4 వికెట్లతో మరోసారి సత్తా చాటడం విశేషం. బుమ్రాకు 3, కుల్దీప్ యాదవ్ కు 2, జడేజాకు 1 వికెట్ లభించాయి. ఇంగ్లండ్ జట్టులో లియామ్ లివింగ్ స్టన్ చేసి 27 పరుగులే అత్యధికం. టాపార్డర్ వైఫల్యంతో ఏ దశలోనూ ఇంగ్లండ్ విజయం దిశగా పయనిస్తున్నట్టు కనిపించలేదు. టీమిండియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఇంగ్లండ్ ను ఒత్తిడిలోకి నెట్టేశారు.
వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ కు ఇది వరుసగా నాలుగో ఓటమి. ఇక ఈ టోర్నీలో ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలు పూర్తిగా ఆవిరయ్యాయి. టీమిండియా 6 మ్యాచ్ ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లండ్ 6 మ్యాచ్ ల్లో 1 విజయం సాధించి కేవలం రెండు పాయింట్లతో జాబితాలో అట్టడుగున ఉంది.