Rohit Sharma: అద్భుతమైన బ్యాటింగ్: భారత్ పై పాక్ మాజీ కెప్టెన్ ప్రశంసలు
- లక్నో పిచ్ పై భారత్ అద్భుతమైన బ్యాటింగ్ చేసిందన్న మిస్బా ఉల్ హక్
- విరాట్ వికెట్ కోల్పోయిన తర్వాత రోహిత్ ఆడిన తీరుపై ప్రశంసలు
- పిచ్ కండిషన్లకు తగ్గట్టు ఆడిందంటూ మెచ్చుకోలు
భారత ఆటతీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంగ్లండ్ తో మ్యాచ్ లో భారత్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టడం తెలిసిందే. దీనిపై దాయాది పాకిస్థాన్ క్రికెటర్లు సైతం సానుకూలంగా స్పందిస్తున్నారు. టీమిండియాను మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా బౌలింగ్ కు అనుకూలించే లక్నోలోని ఏక్నా స్టేడియంలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మెరుగ్గా ఆడి, భారత్ మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. చాలా మంది భారత్ తక్కువ స్కోరు చేసిందని, ఓడిపోవడం ఖాయమని ముందుగా అనుకున్నారు.
కానీ లక్నో పిచ్ తీరు తెలిసిన వారు భారత్ విజయంపై ధీమాగానే ఉన్నారు. చివరికి భారత్ ఘన విజయం సాధించింది. దీనిపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ స్పందిస్తూ.. రోహిత్, సూర్యకుమార్ యాదవ్ ను మెచ్చుకున్నాడు. ‘‘ఈ పిచ్ పై భారత్ అద్భుతమైన బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా వికెట్లు పడుతున్నా కూడా తన ఆటను కొనసాగించింది. ఈ తరహా ధైర్యాన్ని చూపించడం, బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టడం కష్టమైన విషయం’’ అని మిస్బా పేర్కొన్నాడు.
కష్టతరమైన లక్నో పిచ్ పై రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను నిర్మించిన తీరును మిస్బా మెచ్చుకున్నాడు. ‘‘సందేహం లేదు. వారు చక్కని ఆరంభాన్నిచ్చారు. కానీ, మూడు వికెట్లు వరుసగా కోల్పోయారు. విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయిన తర్వాత రోహిత్ ఆడిన తీరు అద్భుతంగా ఉంది’’ అని పాక్ కోచ్ గా వ్యవహరించిన మిస్బా పేర్కొన్నాడు. పిచ్ కండిషన్లను అర్థం చేసుకుని, భారత బ్యాటింగ్ లైనప్ అందుకు తగ్గట్టుగా ఆడిందని అభిప్రాయపడ్డాడు. టీమిండియా ఆటను నాణ్యమైన ఇన్నింగ్స్ గా అభివర్ణించాడు.