Kodandaram: ఈ ఆరు అంశాలను కాంగ్రెస్ ముందు ఉంచాం: మద్దతు ప్రకటించిన కోదండరాం
- ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చేందుకు కలిసి రావాలని కాంగ్రెస్ కోరిందన్న కోదండరాం
- బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు కోదండరాం ప్రకటన
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ అంశాలను నెరవేర్చాలని సూచన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతిస్తున్నట్లు తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులతో భేటీ అనంతరం ఆయన వారితో కలిసి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ జన సమితి తరఫున ఆరు అంశాలను కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టినట్లు చెప్పారు. అలాగే నాణ్యమైన విద్య, వైద్యం ప్రజలకు అందాలని కోరామన్నారు. కాంగ్రెస్తో కలిసి పని చేసేందుకు అంగీకారం తెలిపామన్నారు. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి కలిసి పని చేయాలని వారు తనను కోరారన్నారు. అందుకే నవ తెలంగాణ నిర్మాణ ప్రాతిపదికన మద్దతు తెలిపినట్లు చెప్పారు.
అందరికీ విద్య, వైద్యం అందించే ప్రభుత్వం, ఉద్యోగ, ఉపాధి కల్పన లక్ష్యంగా ఆర్థిక విధాన రూపకల్పన జరగాలని, చిన్న, సూక్ష్మ, కుటీర పరిశ్రమల ఎదుగుదలకు చర్యలు తీసుకోవడం, సంప్రదాయ వృత్తులపై ఆధారపడినవారికి ఆదాయ భద్రత కల్పించడం, వాస్తవ సాగుదారులకు, చిన్న, సన్న, కౌలు రైతులకు ఆదాయ భద్రత, వారి భూమికి రక్షణ, రాజ్యాంగ నీతి, రాజ్యాంగ విలువల ప్రాతిపదికన ప్రజాస్వామ్య పాలన నెలకొల్పి, ఆ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్ని వర్గాల పేదలు, మైనార్టీలకు భాగస్వామ్యం, అభివృద్ధిలో వాటా దక్కేలా చర్యలు, ఉద్యమకారులకు సంక్షేమ కోసం బోర్డు, అమరవీరుల కుటుంబాలకు సమగ్ర సాయం.. ఈ అంశాలను కాంగ్రెస్ ముందు తాము ఉంచామని కోదండరాం తెలిపారు. వీటికి కాంగ్రెస్ అంగీకరించిందన్నారు.