Ch Malla Reddy: జయలలిత దాచిపెట్టిన ఆస్తులని మంత్రి మల్లారెడ్డి దొంగిలించాడు: కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణ
- మల్లారెడ్డి పాలు, పూలు అమ్మి కోట్లాది రూపాయలు సంపాదించలేదన్న సుధీర్ రెడ్డి
- జయలలిత దాచుకున్న నగలు, డబ్బును దొంగిలించాడని ఆరోపణ
- విద్యాసంస్థల యజమానురాలిని మోసం చేసి ఆస్తులు కాజేశాడన్న సుధీర్ రెడ్డి
- కాంగ్రెస్ మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ చేసిందని విమర్శలు
మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత సుధీర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పాలు అమ్మి, పూలు అమ్మి మల్లారెడ్డి ధనవంతుడు కాలేదని, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత డబ్బులు దొంగిలించి, ఇతరుల ఆస్తులు కాజేసి కోట్లాది రూపాయలు సంపాదించారన్నారు. జయలలితకు నగర శివారులోని కొంపల్లిలో 11 ఎకరాల స్థలం ఉండేదని, అందులో డెయిరీ ఫామ్ ఏర్పాటు చేసుకున్నారని, ఆ సమయంలో పాలవ్యాపారం చేసుకుంటోన్న మల్లారెడ్డి అక్కడకు వెళ్లేవాడన్నారు. ఐటీ దాడులు జరగనున్నట్లు జయలలితకు సమాచారం అందడంతో తన వద్ద ఉన్న నగలు, డబ్బు ఓ చోట దాచిపెట్టగా మల్లారెడ్డి వాటిని దొంగిలించాడన్నారు.
తన ఇంటి పక్కన ఉన్న ఓ విద్యాసంస్థల యజమానురాలిని మోసం చేసి, వారి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆమె చనిపోయాక ఆస్తులను కాజేశాడని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకున్న వ్యక్తి ఇప్పుడు నీతులు చెబుతుంటే విడ్డూరంగా ఉందన్నారు. మైసమ్మగూడలో చెరువు శిఖరం భూములను ఆక్రమించి అక్రమంగా కాలేజీలు కట్టాడని, దీంతో భారీ వర్షాలు కురిసినప్పుడు విద్యార్థులు వరదల్లో చిక్కుకున్నారన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోపై విమర్శలు చేసిన బీఆర్ఎస్ చివరకు తమనే కాపీ చేసిందన్నారు. కేసీఆర్ కుటుంబానికి పదవీ వ్యామోహం ఎక్కువైందన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మల్లారెడ్డి, ఆయన బావమరిది ఇక్కడ చేసిందేమీ లేదని విమర్శించారు. తమ వ్యాపారాల కోసం మేడ్చల్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. మల్లారెడ్డి అక్రమాలు వెలుగులోకి తెస్తానన్నారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు.