KCR: చేతకాని వెధవలు బీఆర్ఎస్ అభ్యర్థిపై కత్తితో దాడి చేశారు.. నాపై దాడిగానే భావిస్తా: సీఎం కేసీఆర్

CM KCR on attack on Dubbak MLA candidate Kotha Prabhakar Reddy
  • చేతకాని దద్దమ్మ ప్రతిపక్ష పార్టీలు కొత్త ప్రభాకర్ రెడ్డిని కత్తితో పొడిచి దారుణానికి పాల్పడ్డారని ఆగ్రహం
  • తాను వెళ్లాలనుకున్నప్పటికీ... సభ ముగించుకొని రమ్మని తనకు హరీశ్ రావు చెప్పారన్న కేసీఆర్
  • భగవంతుడి దయతో కొత్త ప్రభాకర్ రెడ్డికి అపాయం తప్పిందన్న ముఖ్యమంత్రి
  • ఇలాంటి దాడులు ఆపకపోతే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నంపై ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ఆయనపై దాడిని తన మీద దాడిగానే పరిగణిస్తానని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్... దాడి ఘటన గురించి తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. తనకు కొంచెం మనసు బాగా లేదని, కారణం ఏమంటే దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిపై కత్తితో దాడి జరిగిందన్నారు. మనం ప్రజల కోసం పని చేసుకుంటూ వెళ్తున్నామని, సమస్యలపై యుద్ధం చేస్తున్నామని, శత్రువులను కూడా మనం ఇబ్బందిపెట్టలేదన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలన్నారు.

దురదృష్టం ఏంటంటే చేతగాని దద్దమ్మ ప్రతిపక్ష పార్టీలు, చేతగాని వెధవలు సిద్దిపేట జిల్లాలో దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ ఎంపీపై కత్తితో పొడిచి దారుణానికి పాల్పడ్డారన్నారు. ఆయనను హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారన్నారు. తాను జుక్కల్‌లో ఉన్నప్పుడే వార్త వచ్చిందని, వాస్తవానికి అక్కడికి వెళ్లాలని అనుకున్నానని, హరీశ్ రావు, మిగిలిన మంత్రులు అక్కడే ఉన్నట్లు చెప్పారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రాణానికి ఇబ్బంది లేదన్నారు. సభలను ముగించుకొని రావాలని తనకు సూచించారని, భగవంతుడి దయతో అపాయం తప్పిందన్నారు కానీ ఇది రాజకీయమా? ఇంత అరాచకమా? అని ప్రశ్నించారు.

బాగా పని చేసే నాయకులపై దాడికి పాల్పడుతున్నారన్నారు. ఎన్నికల్ని  ఎదుర్కొనే దమ్ములేని వారు కత్తులతో దాడులకు దిగారని ధ్వజమెత్తారు. మెదక్ ఎంపీపై జరిగిన దాడిని నా మీద జరిగిన దాడిగానే భావిస్తానన్నారు. ఇలా దాడులకు పాల్పడే వారికి తెలంగాణ సమాజం తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు. ఇలాంటి దాడులు ఆపకపోతే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

మేం బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నామని, ప్రజలకు ఎలా సేవ చేయాలో ఆలోచిస్తున్నామని చెప్పారు. కానీ మీరు దుర్మార్గమైన పనుల్లో ఉన్నారని విపక్షాలను ఉద్దేశించి మండిపడ్డారు. పదేళ్లలో ఎన్నో ఎన్నికలు జరిగాయని, కానీ ఎప్పుడూ ఇలాంటి హింస చోటు చేసుకోలేదన్నారు. తమ సహనాన్ని పరీక్షిస్తే ఊరుకునేది లేదన్నారు. కాగా, మంత్రి హరీశ్ రావుకు ఫోన్ చేసి కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కేసీఆర్ ఆరా తీశారు.
KCR
kotha prabhakar reddy
brs
Telangana Assembly Election

More Telugu News