Telugudesam: కృతజ్ఞతా కచేరి మా హృదయాలను ఉప్పొంగించింది: నారా బ్రాహ్మణి
- చంద్రబాబు 52 రోజులపాటు బయట లేకున్నా ప్రజలను ఏకం చేసిన తీరు ఆశ్చర్యం
- రోజు గడిచే కొద్దీ చంద్రబాబుకు మద్ధతు రెట్టింపు అవుతోందని వ్యాఖ్య
- గచ్చిబౌలి ‘సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్’పై బ్రాహ్మణి ట్వీట్
చంద్రబాబు నాయుడి కోసం గచ్చిబౌలిలో నిర్వహించిన ‘సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్’ నిజంగా తమ హృదయాలను ఉప్పొంగించిందని ఆయన కోడలు, నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి వ్యాఖ్యానించారు. చంద్రబాబు లాంటి ఒక రాజనీతిజ్ఞుడు మాత్రమే ఈ విధంగా తెలుగు సమాజాన్ని హృదయపూర్వకంగా స్పందింపజేయగలిగారని ఆమె కొనియాడారు. 52 రోజులపాటు ఆయన బయటలేకున్నా ప్రజలను ఏకం చేసిన తీరుకు ఆశ్చర్యపోవాల్సిందేనని అన్నారు. గడిచే ప్రతి రోజూ చంద్రబాబు మద్ధతును రెట్టింపు చేస్తున్నట్టుగా ఉందని బ్రాహ్మణి అన్నారు.
నిజాయతీగా, ముక్కుసూటిగా వ్యవహరించే రాజనీతిజ్ఞుడి ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు ఎంత ప్రయత్నించినా సత్యం ఏంటో ప్రజలకు తెలుసునని, వాళ్లంతా చంద్రబాబు పక్షాన బలంగా నిలబడతారని ఆమె ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం జరిగిన ‘సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్’పై ట్విటర్ వేదికగా ఆమె స్పందించారు.
ఇదివుండగా సైబర్టవర్స్ నిర్మాణం జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ‘తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్’ ఆధ్వర్యంలో ‘సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్’ జరిగింది. ఈ ఈవెంట్లో చంద్రబాబు అభిమానులు, ఐటీ ఉద్యోగులు, గ్రేటర్ హైదరాబాద్లోని పలుప్రాంతాలవారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.