Russia: రష్యాలోని డగెస్తన్ ఎయిర్‌పోర్టులోకి నిరసనకారులు.. ప్రయాణికుల్లో యూదుల కోసం వెతుకులాట
- ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం నేపథ్యంలో ఘటన
- టెల్‌అవీన్ నుంచి వచ్చిన విమానాన్ని ల్యాండింగ్ చేయనివ్వొద్దంటూ నిరసన
- తాత్కాలికంగా ఎయిర్‌పోర్టు మూసివేత
రష్యాలోని డగెస్తన్ ఎయిర్‌పోర్టు ఆదివారం రణరంగాన్ని తలపించింది. ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్ నగరం నుంచి వచ్చిన విమానాన్ని ల్యాండింగ్ చేయనివ్వొద్దంటూ వందలాది మంది నిరసనకారులు ఎయిర్‌పోర్టులోకి దూసుకొచ్చారు. ‘అల్లాహ్ అక్బర్’, ‘గాడ్ ఈజ్ గ్రేట్’ నినాదాలు చేస్తూ ప్రయాణికుల్లో యూదుల కోసం వెతుకులాట సాగించారు. గందరగోళ పరిస్థితిని గుర్తించిన రష్యా భద్రతా బలగాలు డగెస్తన్ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశాయి. మరికొన్ని విమానాలను దారి మళ్లించాయి. కాగా ఎయిర్‌పోర్టులోకి దూసుకొచ్చిన ఆందోళనకారుల్లో 60 మందిని అదుపులోకి తీసుకున్నట్టు రష్యా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆందోళనలో క్రియాశీలకంగా పాల్గొన్న 150 మందిని గుర్తించామని, మిగతావారందరినీ గుర్తించే పనిలో ఉన్నామని వెల్లడించింది.
కాగా ఈ ఘటనలో దాదాపు 20 మంది గాయపడ్డారని, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుతానికి విమానాశ్రయం పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉందని వివరించింది. నవంబర్ 6 వరకు ఈ ఎయిర్‌పోర్టు మూసివుంటుందని వెల్లడించింది. ఇజ్రాయెల్, పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రష్యా ఉత్తర కాకసస్ ప్రాంతంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న అనేక ప్రాంతాలలో మఖచ్కల ఒకటి. డగెస్తన్ ఎయిర్‌పోర్టు ఈ ప్రాంతంలోనే ఉంది.