KCR: కాంగ్రెస్ పార్టీలో వాడవాడకు ముఖ్యమంత్రులే ఉంటారు: కేసీఆర్ ఎద్దేవా
- కాంగ్రెస్ పార్టీలో డజను మంది ముఖ్యమంత్రులు ఉన్నారని ఎద్దేవా
- కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు కానీ... ముఖ్యమంత్రులని మాట్లాడుతారని వ్యాఖ్య
- అభ్యర్థులతో పాటు పార్టీల నైజం తెలుసుకోవాలన్న కేసీఆర్
- పంజాబ్ తర్వాత వ్యవసాయంలో మనం రెండో స్థానంలో ఉన్నామన్న కేసీఆర్
కాంగ్రెస్ పార్టీలో వాడవాడకు ముఖ్యమంత్రులే ఉంటారని, నన్ను గెలిపించండి... నేను ముఖ్యమంత్రిని అవుతానని ఆ పార్టీలో ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎద్దేవా చేశారు. హుజూర్ నగర్ ప్రజా ఆశీర్వాద సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారన్నారు. అసలు ఆ పార్టీ గెలిచే పరిస్థితే లేదని, కానీ అందరూ తనను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారన్నారు. ఒక్క హుజుర్‌నగర్‌లోనే కాదు.. దేశమంతా కాంగ్రెస్ పార్టీది అదే పరిస్థితి అన్నారు. తాను సీఎం అవుతానని ఒకరు... బుడ్డరఖాన్ అవుతానని ఇంకొకరు... నేను ఇది అవుతా... అది అవుతానంటూ గోల్ మాల్ చేసి ఓట్లు అడుగుతున్నారన్నారు. పార్టీల తరఫున నిలబడే వ్యక్తులతో పాటు పార్టీల నైజం, దృక్పథం తెలుసుకోవాలన్నారు.
రైతుబంధు అనే పథకాన్ని ప్రపంచంలో పుట్టించిందే కేసీఆర్ అన్నారు. రైతుల కోసం ఖర్చు చేస్తుంటే విపక్షాలు మాత్రం ప్రజల పన్నులను దుబారా చేస్తున్నాయని విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. పంజాబ్ తర్వాత వ్యవసాయంలో మనం రెండో స్థానంలో ఉన్నామన్నారు. తెలంగాణలో మూడు కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నట్లు చెప్పారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజల హక్కులను కాపాడుకున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు, మంచినీళ్ల కోసం అనేక కష్టాలు పడ్డామని, ఇవాళ అన్ని సమస్యలను అధిగమించుకున్నామన్నారు.
గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దుకున్నామని, వారి హక్కులను కాపాడామన్నారు. ఇవాళ మేజర్‌గా కృష్ణా నదిలో నీళ్లు రాలేదని, శ్రీశైలం దాకా నిండిందని, సాగర్ దాకా నీళ్లు రాలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు ఫోన్ చేసి... పంటలు పాడు అవుతున్నాయి... పది పన్నెండు రోజులు నీళ్లు వదలాలని కోరితే అధికారులను పిలిచి మాట్లాడి నీళ్లను వదిలామన్నారు. హుజుర్‌నగర్‌కు వారం పది రోజుల పాటు మళ్లీ నీళ్లు పంపిస్తామని, ఆందోళన అవసరం లేదన్నారు.