Chandrababu: సీఐడీ అధికారుల కాల్ డేటా ఇవ్వాలన్న చంద్రబాబు పిటిషన్ ను కొట్టివేసిన ఏసీబీ కోర్టు
- స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు
- తన అరెస్ట్ కు ముందు వారు ఎవరితో మాట్లాడారో తెలియాలన్న చంద్రబాబు
- ఈ నెల 27తో ముగిసిన వాదనలు
- నేడు తుది తీర్పు వెలువరించిన ఏసీబీ కోర్టు
స్కిల్ వ్యవహారంలో ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబును సెప్టెంబరు 9న నంద్యాలలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే, తన అరెస్ట్ కు ముందు సీఐడీ అధికారులు ఎవరెవరితో మాట్లాడారో తెలియాలని, అరెస్ట్ సమయంలో ఉన్న సీఐడీ అధికారుల కాల్ డేటా ఇవ్వాలని చంద్రబాబు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ కు సంబంధించిన ఈ నెల 27న వాదనలు ముగియగా, ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. చంద్రబాబు పిటిషన్ ను కొట్టివేస్తున్నట్టు నేడు తన తీర్పును వెలువరించింది.
చంద్రబాబును అరెస్ట్ చేసే ముందు సీఐడీ అధికారులు ఎవర్ని సంప్రదించారో తెలిస్తే కేసుకు సంబంధించి కీలక అంశాలు వెల్లడవుతాయని చంద్రబాబు తరఫు న్యాయవాదులు గతంలోనే కోర్టుకు తెలిపారు.
అయితే, దర్యాప్తు అధికారుల కాల్ డేటా ఇవ్వడం వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించినట్టవుతుందని, విచారణపైనా ఆ ప్రభావం పడుతుందని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అంతేకాదు, కేసుకు సంబంధించి అధికారులు పలువురిని సంప్రదిస్తుంటారని, దర్యాప్తులో సంప్రదింపులు మామూలు విషయమేనని తెలియజేశారు. సీఐడీ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు చంద్రబాబు పిటిషన్ ను కొట్టివేసింది.