Indrakaran Reddy: ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం క్రిటికల్‌గా ఉంటే రేవంత్ రెడ్డి నీచపు మాటలు మాట్లాడుతున్నారు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
- ప్రభాకర్ రెడ్డి చావుబతుకుల్లో ఉంటే కోడికత్తి డ్రామా అని మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం
- హత్యా రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని విమర్శ
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఓ వైపు కత్తిపోటు గాయంతో ఆసుపత్రిలో క్రిటికల్ కండిషన్లో ఉంటే మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చాలా నీచంగా మాట్లాడుతున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు ప్రభాకర్ రెడ్డి చావుబతుకుల్లో ఉంటే కోడికత్తి డ్రామా అని రేవంత్ మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వ్యక్తి గురించి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలు, కుతంత్రాలు కొత్తవేమీ కాదన్నారు.
అనాది నుంచి హత్యా రాజకీయాలు చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఎన్నికల్లో ఓటమి ఖాయమని రేవంత్ రెడ్డి భావించడం వల్లే హింసా రాజకీయాలకు దిగుతున్నారన్నారు. తెలంగాణలో హింసా రాజకీయాలకు తావులేదన్నారు. గడిచిన పదేళ్లుగా తెలంగాణ ప్రశాంతంగా ఉందని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. దిక్కుమాలిన కాంగ్రెస్‌తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ కాలకూట విషం లాంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ పొలిమేరల వరకు తరిమి కొట్టాలన్నారు. పచ్చటి తెలంగాణలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు.