Vijayashanti: 25 ఏళ్ల రాజకీయ ప్రయాణంపై భావోద్వేగంగా స్పందించిన విజయశాంతి
- అప్పుడు ఇప్పుడూ సంఘర్షణే ఎదురవుతోందని వ్యాఖ్య
- ఏనాడూ ఏ పదవీ కోరులేదని వెల్లడి
- పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డలు అందరూ సగౌరవంగా ఉండాలని ఆకాంక్ష
సినీ నటి, మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి తన రాజకీయ జీవితంపై భావోద్వేగంగా స్పందించారు. 25 ఏళ్ల తన రాజకీయ ప్రయాణం అప్పుడు ఇప్పుడూ ఎందుకో సంఘర్షణ మాత్రమే ఇస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. ఏనాడూ ఏ పదవీ కోరుకోకున్నా, ఇప్పటికీ అనుకోకున్నా ఈ పరిస్థితే ఎదురవుతోందని అన్నారు. ఇది తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యం అని ఆమె అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘‘ నాడు తెలంగాణ ఉద్యమ బాటలో తెలంగాణ బిడ్డల సంక్షేమం తప్ప, ఇయ్యాల్టి బీఆర్ఎస్‌కు వ్యతిరేకం అవుతామని పోరాటం చేయలేదు. నా పోరాటం నేడు కేసీఆర్ కుటుంబ దోపిడి, కొందరు బీఆర్ఎస్ నేతల అరాచకత్వంపై తప్ప , నాతో కలిసి తెలంగాణా ఉద్యమంలో ప్రాణం అడ్డుపెట్టి పనిచేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కాదు. రాజకీయపరంగా విభేదించినప్పటీకి అన్ని పార్టీల తెలంగాణ బిడ్డలు అందరూ సంతోషంగా, సగౌరవంగా ఉండాలని మనఃపూర్వకంగా కోరుకోవటం మీ రాములమ్మ ఒకే ఒక్క ఉద్దేశ్యం... ఎప్పటికీ. హర హర మహాదేవ్. జై తెలంగాణ’’ అని అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.