Rahul Gandhi: మేడిగడ్డకు బయలుదేరిన రాహుల్ గాంధీ..
- కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను పరిశీలించనున్న అగ్రనేత
- రాహుల్ వెంట వెళ్తున్న రేవంత్ రెడ్డి
- హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు అనుమతివ్వడంతో ఉదయమే పయనం
కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను పరిశీలించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బయలుదేరారు. గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో మేడిగడ్డకు పయనమయ్యారు. ఆయన వెంట టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. బ్యారేజ్ వద్ద 144 సెక్షన్ విధించినప్పటికీ హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వడంతో రాహుల్ గాంధీ గురువారం ఉదయమే బయలుదేరి వెళ్లారు. మంథని నియోజకవర్గంలోని అంబటిపల్లిలో హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు పోలీసులు అనుమతినిచ్చారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో రాహుల్ పర్యటన కోసం పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
ఇదిలావుండగా కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులతో లక్షల ఎకరాలకు నీరు అందుతుంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లతో కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయని రాహుల్‌గాంధీ బుధవారం విమర్శించారు. కల్వకుర్తిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కో బ్యారేజీ కూలిపోతోందని, సీఎం కేసీఆర్ వెళ్లి పరిశీలించి అక్కడే సమీక్ష జరపాలని సూచన చేశారు. ఇక నాగార్జునసాగర్, ప్రియదర్శిని జూరాల, శ్రీరాంసాగర్, సింగూరు ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించాయని, ఏ సమస్యా లేకుండా అవి నేటికీ పటిష్ఠంగా ఉన్నాయని సమర్థించుకున్నారు.