Rajasthan: రాజస్థాన్ లో ఎగిరేది కాషాయ జెండానే.. టైమ్స్ నౌ ఒపీనియన్ పోల్
- బీజేపీకి 124 సీట్ల వరకు వచ్చే అవకాశం
- కాంగ్రెస్ కు 80 సీట్ల లోపే
- ఆ రెండు పార్టీల మధ్యే పోరు
రాజస్థాన్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని, డిసెంబర్ 3 తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని తాజా ఒపీనియన్ పోల్ లో వెల్లడైంది. ఈమేరకు టైమ్స్ నౌ నవభారత్ - ఈటీజీ నిర్వహించిన ఒపీనియన్ పోల్ లో బీజేపీకి 114 సీట్ల నుంచి 124 సీట్లు వస్తాయని తేలింది. ఈసారి పోటీ రెండు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంటుందని, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం నామమాత్రమేనని ఓటర్లు అభిప్రాయపడ్డారు.
200 సీట్లు ఉన్న రాజస్థాన్ అసెంబ్లీకి ఈ నెల 25న ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 3న కౌంటింగ్ నిర్వహించి ఈసీ ఫలితాలు ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ లో ఏ పార్టీ అధికారంలోకి రానుందని టైమ్స్ నౌ నవభారత్ - ఈటీజీ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. సగటున ప్రతీ నియోజకవర్గంలో 105 మంది ఓటర్ల లెక్కన మొత్తం 21,136 మంది ఓటర్లను ప్రశ్నించింది. ఇందులో అధికార పార్టీ కేవలం 68 సీట్ల నుంచి 78 సీట్లకే పరిమితమవుతుందని తేలింది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ 43.80 ఓట్ షేర్ తో 114 నుంచి 124 సీట్లు గెలుచుకుంటుందని వెల్లడైంది.