Dhulipala Narendra Kumar: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కేంద్రానికి నివేదిక ఇవ్వలేదు: ధూళిపాళ్ల
- ఏపీలో కరవు పరిస్థితులపై జగన్ ప్రభుత్వం స్పందించడంలేదన్న ధూళిపాళ్ల
- కర్ణాటక, తెలంగాణ ఇప్పటికే కేంద్రానికి నివేదికలు ఇచ్చాయని వెల్లడి
- ఏపీలో ప్రజల ఆవేదన వినే దిక్కు లేకుండా పోయిందని వ్యాఖ్యలు
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని దుర్భిక్ష పరిస్థితులపై సీఎం జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందని మండిపడ్డారు.
కరవు వల్ల రూ.30 వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు కర్ణాటక కేంద్రానికి నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. తెలంగాణ కూడా పంట నష్టంపై కేంద్రానికి నివేదిక ఇచ్చిందని తెలిపారు. కానీ, ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఇప్పటివరకు నివేదిక ఇవ్వలేదని ధూళిపాళ్ల ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజల ఆవేదన వినే దిక్కు లేకుండా పోయిందని అన్నారు.
ప్రచారానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటారు... రైతులకు మాత్రం రూపాయి ఇవ్వలేరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నష్టపోతున్నా సీఎం జగన్ పట్టించుకోవడంలేదని ధూళిపాళ్ల విమర్శించారు. కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా రైతులకు దక్కట్లేదని వెల్లడించారు.