Tammineni veerabhadram: కాంగ్రెస్‌తో పొత్తు లేదని తేల్చేసిన తమ్మినేని వీరభద్రం.. సీపీఎం పోటీ చేసే 17 స్థానాలివే!
- అవమానకరంగా పొత్తుకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదన్న తమ్మినేని
- పొత్తు కుదరకపోవడానికి కాంగ్రెస్ బాధ్యత వహించాలని వెల్లడి
- ప్రత్యేక పరిస్థితుల్లో తాము ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించామన్న తమ్మినేని
కాంగ్రెస్‌తో పొత్తుతో ముందుకు సాగడం లేదని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం గురువారం కీలక ప్రకటన చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల కోసం పొత్తు కుదరకపోవడానికి కాంగ్రెస్సే కారణమన్నారు. తమకు తొలుత భద్రాచలం, పాలేరు, వైరా సీట్లు ఇస్తామని చెప్పారని, ఆ తర్వాత మొదటి రెండు స్థానాలను పక్కన పెట్టి, వైరా, మిర్యాలగూడ ఇస్తామని చెప్పారని, అయినా తాము వెనక్కి తగ్గామన్నారు. తమకు రెండు సీట్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, కానీ వాటిని కూడా ఇప్పుడు ఇవ్వడం లేదన్నారు.
దీంతో తాము ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇంత అవమానకరంగా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు కలవాలని, కాంగ్రెస్ వద్దనుకున్నప్పుడు తాము పొత్తుతో వెళ్లలేమన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గడువు కంటే ఎక్కువగా వేచి చూశామని, కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. మల్లు భట్టి తనకు ఫోన్ చేసి సాయంత్రం వరకు వేచి చూడాలని చెప్పారని, కానీ ఆ పార్టీ నుంచి స్పందన లేకపోగా.. సీట్లు ఇవ్వం.. ఎమ్మెల్సీలుగా చేస్తాం.. మంత్రులుగా చేస్తామని మాకు చెబుతున్నారని మండిపడ్డారు.
1996లో ప్రధాని పదవినే తృణపాయంగా వదిలేసిన పార్టీ తమది అన్నారు. లేదంటే జ్యోతిబసు అప్పుడే ప్రధానమంత్రి అయి ఉండేవారన్నారు. అలాంటి తమకు ఎమ్మెల్సీలు ఇస్తాం... మంత్రి పదవులు ఇస్తామని చెబుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే కమ్యూనిస్టులు ఎలా కనిపిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక పరిస్థితుల్లో తాము విడిగా పోటీ చేయాలని నిర్ణయించి, అభ్యర్థులను ప్రకటిస్తున్నామన్నారు.
నకిరేకల్, మిర్యాలగూడ, నల్గొండ, భువనగిరి, హుజూర్ నగర్, కోదాడ, జనగామ, భద్రాచలం, అశ్వారావుపేట, పాలేరు, వైరా, సత్తుపల్లి, ఖమ్మం, మధిర, ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు. అవసరమైతే మరో మూడు నాలుగు సీట్లు కలుస్తాయని, ఇరవై సీట్లలో పోటీ చేసే అవకాశముందన్నారు. అయితే ఇప్పుడు తాము ప్రకటించిన జాబితాలో సీపీఐ పోటీ చేస్తే కనుక తాము ఉపసంహరించుకుంటామన్నారు.