Team India: వాంఖెడేలో గిల్, కోహ్లీ, అయ్యర్ విజృంభణ... శ్రీలంక ముందు భారీ టార్గెట్

Team India set Sri Lanka 358 runs huge target

  • వరల్డ్ కప్ లో నేడు టీమిండియా × శ్రీలంక
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా
  • 50 ఓవర్లలో 8 వికెట్లకు 357 పరుగులు
  • గిల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ అర్ధసెంచరీలు

ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో శ్రీలంకతో వరల్డ్ కప్ పోరులో టీమిండియా భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రోహిత్ సేన నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 357 పరుగులు నమోదు చేసింది. టీమిండియా ఇన్నింగ్స్ లో ఓపెనర్ శుభ్ మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ అర్ధసెంచరీలతో అలరించారు. శ్రీలంక లెఫ్టార్మ్ పేసర్ దిల్షాన్ మధుశంక 5 వికెట్లు తీశాడు. అయితే భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 10 ఓవర్లలో 80 పరుగులు ఇచ్చుకున్నాడు. 

టీమిండియా ఓపెనర్ గిల్ 92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. సెంచరీకి చేరువగా వచ్చిన గిల్ ను మధుశంక అవుట్ చేశాడు. ఆరంభంలో అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్న కోహ్లీ 94 బంతుల్లో 11 ఫోర్లతో 88 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేసి ఉంటే... వన్డేల్లో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డును సమం చేసి ఉండేవాడు. కానీ, కోహ్లీ కూడా ఇవాళ్టి మ్యాచ్ లో తన వికెట్ ను మధుశంకకే అప్పగించాడు. 

ఇక, శ్రేయాస్ అయ్యర్ సొంతగడ్డపై చెలరేగి ఆడాడు. అయ్యర్ కేవలం 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. అయ్యర్ కూడా మధుశంక ఖాతాలోకే చేరాడు. చివర్లో రవీంద్ర జడేజా 24 బంతుల్లో 35 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 21, సూర్యకుమార్ యాదవ్ 12 పరుగులు చేశారు. ఇన్నింగ్స్ ఆరంభంలో కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 4 పరుగులకే వెనుదిరిగాడు.

  • Loading...

More Telugu News