Jeevitha: నేను ఇప్పుడు వైసీపీలో లేను ... నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు: జీవిత

Jeevitha reacts to her name being brought in Vyuham movie related issue
  • సెన్సార్ రివైజింగ్ కమిటీ ముందుకు వ్యూహం చిత్రం
  • కమిటీలో సభ్యురాలిగా ఉన్న జీవిత గతంలో వైసీపీ నేత అంటున్న నట్టి కుమార్
  • ఆమెను కమిటీ నుంచి తప్పించాలని విజ్ఞప్తి
  • తాను ఇప్పుడు బీజేపీలో ఉన్నానని జీవిత వెల్లడి
రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం' సినిమా సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ముందుకెళ్లిన నేపథ్యంలో, రివైజింగ్ కమిటీలో సభ్యురాలిగా ఉన్న నటి జీవిత రాజశేఖర్ ను తప్పించాలని నిర్మాత నట్టి కుమార్ సెన్సార్ బోర్డును కోరడం తెలిసిందే. జీవిత గతంలో వైసీపీలో ఉన్నారని, ఇప్పుడామె బీజేపీలో ఉన్నప్పటికీ వైసీపీతో సంబంధాలు ఉంటాయని, అందుకే ఆమెను కమిటీ నుంచి తాత్కాలికంగా తప్పించాలని నట్టి కుమార్ పేర్కొన్నారు. దీనిపై జీవిత స్పందించారు. 

తాను ఇప్పుడు బీజేపీలో ఉన్నానని వెల్లడించారు. తనకు, వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న ఫొటోలు చాలా సంవత్సరాల నాటివని జీవిత తెలిపారు. 

'వ్యూహం' అనే సినిమా రివైజింగ్ కమిటీ ముందుకు వచ్చినప్పుడు అన్ని సినిమాలు చూసినట్టుగానే ఆ సినిమాను కూడా చూస్తానని పేర్కొన్నారు. దీనిపై తనకు ఇంకా ఆఫీస్ నుంచి ఎటువంటి సమాచారం రాలేదని తెలిపారు. అయినా, తన గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని జీవిత వ్యాఖ్యానించారు.
Jeevitha
Vyuham
Revising Committee
Censor Board
Natti Kumar
Tollywood

More Telugu News