KCR: ఒకసారి ఓటేస్తే మళ్లీ అయిదేళ్ల వరకు అవకాశం లేదు... అందుకే...!: భైంసాలో కేసీఆర్
- ప్రజలను ఆగం చేయాలని ప్రతిపక్షాలు చూస్తాయి.. కాన ఆలోచించి ఓటేయాలన్న ముఖ్యమంత్రి
- రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ఆగ్రహం
- ప్రధాని నరేంద్రమోదీ మోటార్లకు మీటర్లు పెట్టమని చెబితే తాను ఒప్పుకోలేదన్న సీఎం
- మతాలు, కులాలకు అతీతంగా ముందుకు సాగుదామని కేసీఆర్ పిలుపు
ఒకసారి ఓటు వేస్తే మళ్లీ అయిదేళ్ల వరకు అవకాశం లేదని, కాబట్టి ఓటు వేసే ముందు ఆలోచించి వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు సూచించారు. భైంసాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఆగమాగం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని, కానీ ఆలోచించి ఓటేయాలన్నారు. ప్రతిపక్షాలు అబద్దాలు, గాలిమాటలు చెబుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్ద ఉన్న ఒకే ఒక వజ్రాయుధం ఓటు అన్నారు. ఈ ఓటును మంచిగా వినియోగించుకోవాలన్నారు. ప్రతిపక్షాల మాయలో ఎవరూ పడవద్దన్నారు. ఏ పార్టీ వైఖరి ఎలా ఉందో ప్రజలంతా పరిగణలోకి తీసుకోవాలన్నారు.
ఎన్నికలు వస్తాయి.. పోతాయి.. కానీ పోటీ చేసే అభ్యర్థులను, పార్టీలను చూడాలన్నారు. మేం చేసిన అభివృద్ధి మీ కళ్లకు కనిపిస్తోందన్నారు. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, దీనిని అందరూ ఆలోచించాలన్నారు.
70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడ్డారని, అందుకే వ్యవసాయాన్ని స్థిరీకరించాలని నిర్ణయించి ఆ దిశగా అడుగులు వేశామన్నారు. కాంగ్రెస్ దేశాన్ని, రాష్ట్రాన్ని ఏళ్ల తరబడి పాలించిందని, మధ్యలో టీడీపీ పాలించిందని, పదేళ్లుగా బీఆర్ఎస్ ఉందని, కాబట్టి ఏ పార్టీ ఏం చేసిందో చూడాలన్నారు. ప్రతిపక్షాల మాయలో పడవద్దన్నారు. ధరణిని తీసేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని, అప్పుడు మళ్లీ దళారుల రాజ్యం వస్తుందన్నారు. తాను చెప్పే మాటలను ఊళ్లో చర్చకు పెట్టాలని సూచించారు. చెరువులు బాగు చేసుకున్నాం... చెక్ డ్యాంలు కట్టుకున్నామన్నారు. ఇదివరకు నీళ్లకు కూడా ఇబ్బంది ఉండేదని, ఇప్పుడు ప్రతి ఇంటికి నల్లా నీరు వస్తోందన్నారు.
మోటార్లకు మీటర్ పెట్టాలని ప్రధాని నరేంద్రమోదీ తనకు చెప్పారని, కానీ దానికి తాను అంగీకరించలేదన్నారు. మనం మీటర్లు పెట్టనందుకు రూ.25 వేల కోట్ల నిధులను కేంద్రం ఇవ్వలేదన్నారు. కేంద్రం ఎంతగా ఒత్తిడి చేసినా తాము మీటర్లు పెట్టలేదన్నారు. అందుకే బీజేపీ అభ్యర్థి వస్తే ఈ విషయాన్ని అడగాలని ప్రజలకు సూచించారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని, నవోదయ విద్యాలయాలను ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో భైంసాలో రోడ్లు ఎలా వెడల్పు అయ్యాయో అందరూ చూస్తున్నారన్నారు. కులం, మతం లేకుండా మనం అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామన్నారు. కాంగ్రెస్ నేతలు ఇన్నాళ్లు దళితులను ఓటుబ్యాంకుగా మార్చుకున్నారు తప్ప వారికి చేసిందేమీ లేదన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధును తీసుకువచ్చింది అని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ వచ్చాక ఎరువుల కొరత లేదన్నారు.
భైంసాలో, ముధోల్లో ఇలా అన్నిచోట్ల హిందువులు, ముస్లింలు ఉన్నారని, కానీ భైంసాలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో కర్ఫ్యూలు, ధర్నాలు లేవన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే వారిని దూరం పెట్టాలన్నారు. అన్ని మతాలు, కులాల వాళ్లం కలిసి ముందుకు సాగుదామన్నారు. బీఆర్ఎస్ మరోసారి గెలిస్తేనే తెలంగాణ మరింత ముందుకు సాగుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.