Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ అదరగొట్టింది!

Aghanistan did it again as the team beat Nederlands by 7 wickets
  • వరల్డ్ కప్ లో సంచలన విజయాలు సాధిస్తున్న ఆఫ్ఘనిస్థాన్
  • ఇవాళ నెదర్లాండ్స్ పై ఏకపక్ష విజయం
  • 7 వికెట్ల తేడాతో డచ్ జట్టును ఓడించిన ఆఫ్ఘనిస్థాన్
  • పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరిన వైనం
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఒకట్రెండు విజయాలు సాధిస్తే గొప్ప అనే అభిప్రాయాలు వినిపించాయి. సీన్ కట్ చేస్తే...   వరల్డ్ కప్ లో ఇప్పటిదాకా 7 మ్యాచ్ లు ఆడిన ఆఫ్ఘనిస్థాన్ 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. సంచలన విజయాలతో టోర్నీలో అందరినీ ఆకట్టుకుంటున్న ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఇవాళ నెదర్లాండ్స్ ను కూడా మట్టికరిపించింది. 

లక్నోలో ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో ఆఫ్ఘన్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్ ను 179 పరుగులకే కుప్పకూల్చిన ఆఫ్ఘనిస్థాన్... 180 పరుగుల లక్ష్యాన్ని కేవలం 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

కెప్టెన్ హష్మతుల్లా షాహిది జట్టును ముందుండి నడిపించాడు. షాహిదీ 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. రహ్మత్ షా 52 పరుగులు చేయగా, అజ్మతుల్లా ఒమర్జాయ్ 31 (నాటౌట్) సత్తా చాటాడు. అంతకుముందు, ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ 10, ఇబ్రహీం జాద్రాన్ 20 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగాన్ వాన్ బీక్ 1, వాన్ డెర్ మెర్వ్ 1, సకీబ్ జుల్ఫికర్ 1 వికెట్ తీశారు. 

ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్థాన్ సెమీస్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఆ జట్టు ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఆఫ్ఘన్ జట్టు తన తదుపరి మ్యాచ్ ను నవంబరు 7న ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఆ తర్వాత నవంబరు 10న దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఆసీస్, దక్షిణాఫ్రికా జట్లు బలమైనవి కావడంతో, ఆఫ్ఘన్ల పోరాటపటిమకు సిసలైన సవాలు ఎదురుకానుంది. ఇతర జట్ల మ్యాచ్ ల ఫలితాలు కూడా కలిసొస్తే, ఆఫ్ఘన్ కు సెమీస్ బెర్తు దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

వరల్డ్ కప్ లో ఇప్పటివరకు ఆఫ్ఘనిస్థాన్ ప్రస్థానాన్ని చూస్తే... తొలుత బంగ్లాదేశ్, టీమిండియా జట్ల చేతిలో ఓటమిపాలైంది. ఆ తర్వాత ఇంగ్లండ్ పై గెలిచి న్యూజిలాండ్ చేతిలో ఓడింది. అనంతరం పాకిస్థాన్, శ్రీలంక జట్లపై సంచలన విజయాలు నమోదు చేసిన ఆఫ్ఘనిస్థాన్ తాజాగా నెదర్లాండ్స్ పై విజయంతో టోర్నీలో నాలుగో గెలుపును సాధించింది.
Afghanistan
Nederlands
Lucknow
ICC World Cup

More Telugu News