USA: ఏదో ఒక రోజు అమెరికా గతంగా మిగిలిపోతుంది: హమాస్ నేత డెడ్లీ వార్నింగ్
- పూర్వ యూఎస్ఎస్ఆర్ మాదిరిగా పతనమవుతుందని అలీ బరాకా హెచ్చరిక
- అమెరికా శత్రుదేశాలన్నీ ఒక్కటవుతున్నాయని వ్యాఖ్య
- యూఎస్‌పై దాడి చేయగల సామర్థ్యాన్ని సంపాదించిన ఉత్తరకొరియాకు ప్రశంస
అగ్రరాజ్యంగా భావిస్తున్న అమెరికా ఏదో ఒక రోజు గతంగా మిగిలిపోతుందని, పూర్వ రష్యా ‘యూఎస్ఎస్ఆర్’ మాదిరిగా పతనమవుతుందని హమాస్ సీనియర్ లీడర్ అలీ బరాకా తీవ్ర హెచ్చరిక జారీ చేశాడు. ఈ ప్రాంతంలోని అమెరికా శత్రువులందరూ చర్చలు జరుపుతున్నారని, ఒక్కటవుతున్నారని, అంతా కలిసి ఉమ్మడిగా యుద్ధంలో పాల్గొనే రోజు రావొచ్చని తీవ్రంగా హెచ్చరించాడు. బ్రిటన్, గ్లోబల్ ఫ్రీమాసన్రీ(అంతా ఒక్కటే అనే భావం) కారణంగా అమెరికా ఏర్పడిందని, ఏదో ఒక రోజు తప్పకుండా కూలిపోతుందని పేర్కొన్నాడు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో అతడు ఈ విధంగా స్పందించాడని ‘జెరూసలెం పోస్ట్’ రిపోర్ట్ పేర్కొంది. నవంబర్ 2న ఓ లెబనీస్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసినట్టు ప్రస్తావించింది.
అమెరికా శక్తిమంతంగా ఉండబోదని అన్నాడు. ఈ సందర్భంగా అమెరికాపై దాడి చేయగల సామర్థ్యాన్ని సంపాదించిన ఉత్తర కొరియాను అలీ బరాకా ప్రశంసించారు. బహుశా ప్రపంచంలో అమెరికాపై దాడి చేయగల సామర్థ్యం ఉన్న ఏకైక వ్యక్తి కిమ్ జాంగ్ ఉన్ అని మెచ్చుకున్నారు. తమపై దాడి చేస్తే ఉత్తరకొరియా జోక్యం చేసుకునే రోజు రావొచ్చని, ఎందుకంటే ఉత్తరకొరియా కూడా తమ కూటమిలో భాగమని పేర్కొన్నారు. హమాస్ ప్రతినిధి బృందం ఇటీవలే మాస్కోకు వెళ్లిందని, మరో బృందం బీజింగ్‌కు కూడా వెళ్తుందని హమాస్ అధికారి పేర్కొనట్టు ‘జెరూసలేం పోస్ట్’ పేర్కొంది.