Rachin Ravindra: తొలి వరల్డ్ కప్ లోనే సచిన్ రికార్డును బద్దలు కొట్టిన రచిన్ రవీంద్ర
- 25 ఏళ్ల వయసులోపల వరల్డ్ కప్ లలో 3 సెంచరీలు బాదిన రచిన్
- ఇదే వయసులోగా 2 సెంచరీలు చేసిన సచిన్
- ఒకే ప్రపంచకప్ లో 3 సెంచరీలు చేసిన క్రికెటర్ గా రచిన్ మరో ఘనత
వన్డే ప్రపంచకప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ యువ క్రికెటర్ రచిన్ రవీంద్ర ప్రపంచ రికార్డును సృష్టించాడు. సెంచరీతో కదం తొక్కిన రచిన్... ప్రపంచ క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో 25 ఏళ్ల వయసులోగా అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను వెనక్కి నెట్టాడు. సచిన తన 25 ఏళ్లలోపు వయసులో ప్రపంచకప్ లలో 2 సెంచరీలు చేశాడు. అప్పుడు సచిన్ కు 23 ఏళ్ల 351 రోజులు వయసు ఉంది. తొలిసారి వరల్డ్ కప్ ఆడుతున్న రచిన్... తొలి ప్రపంచకప్ లో అప్పుడే 3 సెంచరీలు సాధించాడు. మరో 2 హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేశాడు. రచిన్ వయసు 22 ఏళ్ల 313 రోజులు మాత్రమే. మరోవైపు ఒకే ప్రపంచకప్ ఎడిషన్ లో 3 సెంచరీలు చేసిన తొలి న్యూజిలాండ్ క్రికెటర్ గా రచిన్ ఇంకో ఘనతను సాధించాడు.