Bandi Sanjay: ఆ విషయాన్ని కరీంనగర్ ప్రజలు ఇంకా మరిచిపోలేదు: బండి సంజయ్
- జూబ్లీ గ్రామంలో బీజేపీ బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్
- బీజేపీ విజయం ఖాయమని ధీమా
- బీఆర్ఎస్, మజ్లిస్ ఉమ్మడి అభ్యర్థిని ఓడించాలని ప్రజలకు పిలుపు
భారతీయ జనతా పార్టీని ఎన్నికల్లో ఎదుర్కొనే ధైర్యం లేక అధికార బీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ పార్టీ ముందు, ఆ పార్టీ నేతలు ఓవైసీల ముందు మోకరిల్లుతున్నారని, గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఎంఐఎం జండాలతో ర్యాలీ నిర్వహించిన సంగతి కరీంనగర్ ప్రజలు ఇంకా మరిచిపోలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ లోక్ సభ సభ్యుడు బండి సంజయ్ అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గంలోని జూబ్లీ గ్రామంలో బీజేపీ బూత్ కమిటీ సభ్యుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... బీజేపీ విజయం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల్లోనూ ఇదే భావన ఉందన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థిని ఓడించి బీజేపీ పార్టీని లక్ష మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 7 మోదీ తెలంగాణ పర్యటన
ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. నవంబర్ 7వ తేదీన ఆయన రాష్ట్రానికి రానున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొంటారు. ప్రధాని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో 7వ తేదీ సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా గం.5.30కి ఎల్బీ స్టేడియంకు వస్తారు. గం.6.10 వరకు సభలో ఉండనున్నారు. సభ ముగిసిన తర్వాత గం.6.35కి తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారు. ఈ సభను లక్షమందితో నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది.