Telangana: బీజేపీ-జనసేన తదుపరి కార్యాచరణ నేడు ప్రకటన!
- పవన్ కల్యాణ్ నివాసంలో ఇరుపార్టీల మధ్య కీలక చర్చలు
- అభ్యర్థుల గెలుపునకు ఉమ్మడిగా పనిచేయాలని నిర్ణయం
- 7న ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభకు హాజరుకానున్న పవన్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో నేడు (ఆదివారం) తదుపరి ఉమ్మడి కార్యచరణను ప్రకటించనున్నారని సమాచారం. పొత్తుకు సంబంధించి శనివారం రాత్రి జనసేనాని పవన్ కల్యాణ్ నివాసంలో కీలక చర్చలు జరిగాయి. ఎన్నికల్లో ఇరు పార్టీల అభ్యర్థుల విజయానికి ఉమ్మడిగా పనిచేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, జనసేన తరపున నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
జనసేన ఏయే నియోజకవర్గల్లో పోటీ చేయనుందనే అంశంతోపాటు తదుపరి కార్యాచరణను ఆదివారం(నేడు) వెల్లడించనున్నారని సమాచారం. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 7న తెలంగాణకు వస్తున్నారు. ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించే బీసీ ఆత్మగౌరవ సభకు హాజరుకావాలని కోరగా పవన్‌కల్యాణ్ సానుకూలంగా స్పందించారని బీజేపీ వెల్లడించింది.ఎన్‌డీయేలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ గతంలో అసెంబ్లీ, కార్పొరేషన్ ఎన్నికల్లో సంపూర్ణంగా సహకరించిందని, ఈ ఎన్నికల్లో జనసేనతో సీట్ల సర్దుబాటు కొలిక్కివచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇదిలావుండగా జనసేన 9 స్థానాల్లో పోటీ చేసేందుకు ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. ఏయే స్థానాల్లో బరిలోకి దిగబోతోందనేది త్వరలోనే వెల్లడికానుంది.
మరోవైపు బీజేపీ ఇప్పటికే ఇప్పటికే 88 మంది అభ్యర్థులను ప్రకటించింది. జనసేనకు 9 నియోజకవర్గాలను మినహాయించగా ఇంకా 22 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.