Komatireddy Raj Gopal Reddy: కొట్టిండు, గిచ్చిండు అని ఈ పంచాయితీలు ఏందిరా నాయనా!: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- మళ్లీ సొంతగూటికి చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- మునుగోడును తిరిగి చేజిక్కించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న వైనం
- నేడు నియోజకవర్గ కార్యకర్తల స్థాయి సమావేశం
కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం, ఉప ఎన్నికలో ఓడిపోవడం, ఆపై మళ్లీ సొంతగూడు కాంగ్రెస్ పార్టీలో చేరడం తెలిసిందే. మునుగోడు పీఠాన్ని మళ్లీ చేజిక్కించుకునేందుకు రాజగోపాల్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు.
ఆయన ఇవాళ మునుగోడులో నియోజకవర్గ కార్యకర్తల స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీతో 35ఎంఎం సినిమా అయిపోయిందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారా 70ఎంఎం సినిమా చూపిస్తామని ప్రత్యర్థులను హెచ్చరించారు. 90 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, వారందరికీ తాను అండగా ఉంటానని రాజగోపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. అయితే, కార్యకర్తలు చిన్న చిన్న విషయాలకే పంచాయితీలు పెట్టుకోవద్దని హితవు పలికారు.
మీరు రమ్మంటేనే వచ్చాను... గిచ్చిండు, కొట్టిండు అని చెప్పి ఈ పంచాయితీలు ఏందిరా నాయనా అని కార్యకర్తల తీరుపై అసహనం వెలిబుచ్చారు. ఏవైనా సమస్యలు ఉంటే సభ అయిపోయాక నాలుగు గోడల మధ్య కూర్చుని మాట్లాడుకుందామని, మునుగోడు కాంగ్రెస్ లో ఉన్న పలు వర్గాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మనం ఇలా కొట్లాడుకుంటుంటే బీఆర్ఎస్ వాళ్లు ఎద్దేవా చేస్తారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అధిష్ఠానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. ఇక, తనను ఎవరూ కొనలేరని, తాను అమ్ముడుపోయే వ్యక్తిని కానని స్పష్టం చేశారు.