Virat Kohli: ఎవరికీ సాధ్యం కాని సచిన్ రికార్డును సమం చేసిన కింగ్ కోహ్లీ

Kohli equals Sachin record most centuries in ODIs
  • ఇవాళ దక్షిణాఫ్రికాతో టీమిండియా మ్యాచ్
  • 119 బంతుల్లో 100 పరుగులు  చేసిన కోహ్లీ
  • సచిన్ 49 సెంచరీల రికార్డు సమం చేసిన కింగ్
  • తన పుట్టినరోజు నాడే అద్భుత రికార్డు సొంతం చేసుకున్న వైనం
క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ అంటే ఒక మహోన్నత శిఖరంగా భావిస్తారు. సచిన్ సాధించిన రికార్డులు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయంటే ఆయన స్థాయి ఏంటో అర్థమవుతుంది. అలాంటి సచిన్ రికార్డును అందుకోవడం అంటే అందరికీ సాధ్యమయ్యే పనికాదు. కానీ కింగ్ కోహ్లీ సుసాధ్యం చేశాడు. 

సచిన్ వన్డేల్లో నమోదు చేసిన 49 సెంచరీల రికార్డును ఇవాళ దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ద్వారా కోహ్లీ అందుకున్నాడు. సచిన్ 452 ఇన్నింగ్స్ లలో 49 సెంచరీలు చేయగా... కోహ్లీ కేవలం 277 ఇన్నింగ్స్ ల్లోనే 49 సెంచరీలు చేసి ఔరా అనిపించాడు. అది కూడా తన పుట్టినరోజు నాడే ఈ రికార్డు అందుకోవడం కోహ్లీ కెరీర్ లో మరింత మధుర క్షణాలను ఆవిష్కరించింది. ఈ జాబితాలో సచిన్, కోహ్లీ తర్వాత స్థానంలో ఉన్న రోహిత్ శర్మ ఇంకా 31 సెంచరీల వద్దే ఉన్నాడంటే కోహ్లీ గొప్పదనం ఏంటో అర్థమవుతుంది.

నేడు దక్షిణాఫ్రికాతో వరల్డ్ కప్ మ్యాచ్ లో కోహ్లీ 119 బంతుల్లో 100 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 10 ఫోర్లు ఉన్నాయి. మరో ఎండ్ లో రవీంద్ర జడేజా కూడా ధాటిగా ఆడడంతో టీమిండియా 300 మార్కు దాటింది. 

నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. కోహ్లీ 101 పరుగులతో అజేయంగా నిలవగా, జడేజా 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 29 (నాటౌట్) పరుగులు సాధించాడు. అంతకుముందు, శ్రేయాస్ అయ్యర్ అర్ధసెంచరీతో రాణించాడు. అయ్యర్ 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లతో 77 పరుగులు చేశాడు. 

కెప్టెన్ రోహిత్ శర్మ 40, శుభ్ మాన్ గిల్ 23 పరుగులు చేశారు. కేఎల్ రాహుల్ 8, సూర్యకుమార్ యాదవ్ 22 పరుగులకు అవుటయ్యారు. సఫారీ బౌలర్లలో ఎంగిడి, యన్సెన్, రబాడా, కేశవ్ మహరాజ్, షంసీ తలో వికెట్ పడగొట్టారు.
Virat Kohli
Record
Sachin Tendulkar
Centuries
ODI
Team India
South Africa

More Telugu News