YS Sharmila: మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చి గెలవాలనుకుంటున్నారు: వైఎస్ షర్మిల
- కేసీఆర్, కేటీఆర్ లపై మరోసారి విమర్శలు గుప్పించిన షర్మిల
- అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము లేదని విమర్శలు
- పనికిరాని ప్రాజెక్ట్ కట్టి లక్ష కోట్లు దోచుకున్నారని మండిపాటు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్టీపీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. మరోవైపు, ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ... బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలను ఎక్కుపెడుతూనే ఉన్నారు. తాజాగా ఆమె మాట్లాడుతూ... మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చి ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ యత్నిస్తున్నారని మండిపడ్డారు.
అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము లేక... మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకుంటున్నారని షర్మిల విమర్శించారు. నమ్మి రెండు సార్లు అధికారాన్ని కట్టబెడితే... తండ్రీకొడుకులు కేసీఆర్, కేటీఆర్ లు రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నారని మండిపడ్డారు. పనికిరాని ప్రాజెక్ట్ కట్టి లక్ష కోట్లు దోపిడీ చేసిన చరిత్ర మీది అని అన్నారు. నిధులు మీ ఖజానాకే, నీళ్లు మీ ఫామ్ హౌస్ కే, నియామకాలు మీ ఇంట్లో వాళ్లకే అని విమర్శించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని చంపేసి, తాలిబాన్ల పాలన చేస్తున్న మిమ్మల్ని తరిమేసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్టు ఆమె తెలిపారు.