Bandi Sanjay: బీజేపీని పరుగులు పెట్టించా.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీని పరుగులు పెట్టించానన్న బండి సంజయ్
- పార్టీ బలోపేతం కోసం 150 రోజులు ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించానని వెల్లడి
- ప్రశ్నాపత్రాల లీకేజీపై పోరాడితే తనపై 30 అక్రమ కేసులు పెట్టారని విమర్శ
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తనకు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన తర్వాత తెలంగాణలో బీజేపీని పరుగులు పెట్టించానన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిందని గుర్తు చేశారు. పార్టీ బలోపేతం కోసం తెలంగాణవ్యాప్తంగా 150 రోజుల పాటు ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించినట్లు చెప్పారు.
కేసీఆర్ పాలనలో ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగిందని, వీటికి వ్యతిరేకంగా పోరాడితే తనపై 30 అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. తనపై మతతత్వ ముద్ర వేసే ప్రయత్నాలు కూడా జరిగాయన్నారు. ధర్మం కోసం పోరాడేది కేవలం బీజేపీ మాత్రమే అన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, తాను ధర్మం కోసమే పోరాడుతున్నామన్నారు. తామిద్దరం ఎప్పుడూ కాషాయజెండాను వదిలి పెట్టలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరు పది ఓట్లు వేయించాలని పిలుపునిచ్చారు.