Angelo Mathews: క్రికెట్ చరిత్రలో ఈ విధంగా అవుటైన మొదటి బ్యాట్స్ మన్... ఏంజెలో మాథ్యూస్
- ఢిల్లీలో బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్
- శ్రీలంకకు మొదట బ్యాటింగ్
- నాలుగో వికెట్ గా అవుటైన సమరవిక్రమ
- సకాలంలో బ్యాటింగ్ కు దిగడంలో జాప్యం చేసిన మాథ్యూస్
- ఐసీసీ నిబంధనల ప్రకారం టైమ్ డ్ అవుట్ గా ప్రకటించిన అంపైర్లు
ఇవాళ ఢిల్లీలో బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా, శ్రీలంక బ్యాట్స్ మన్ ఏంజెలో మాథ్యూస్ 'టైమ్ డ్ అవుట్' నిబంధన ప్రకారం అవుటయ్యాడు.
అసలేం జరిగిందంటే... ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకోగా, శ్రీలంక మొదట బ్యాటింగ్ కు దిగింది. లంక బ్యాటర్ సదీర సమరవిక్రమ నాలుగో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అయితే, తదుపరి బ్యాట్స్ మన్ ఏంజెలో మాథ్యూస్ సకాలంలో బ్యాటింగ్ కు రావడంలో విఫలం కావడంతో అతడిని 'టైమ్ డ్ అవుట్' గా అంపైర్లు ప్రకటించారు.
సమరవిక్రమ అవుటైన వెంటనే మాథ్యూస్ మైదానంలో అడుగుపెట్టినప్పటికీ, హెల్మెట్ కు ఉన్న స్ట్రాప్ ఊడిపోవడంతో డగౌట్ నుంచి మరో హెల్మెట్ తెప్పించుకునే క్రమంలో జాప్యం జరిగింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ బ్యాట్స్ మన్ అవుటైన 3 నిమిషాల లోపు కొత్త బ్యాట్స్ మన్ బంతిని ఎదుర్కొనేందుకు క్రీజులోకి రావాల్సి ఉంటుంది. వరల్డ్ కప్ లో ఈ సమయం 2 నిమిషాలుగా ఉంది. కానీ, ఆ సమయం దాటిపోవడంతో బంగ్లాదేశ్ ఫీల్డర్లు అంపైర్ కు అప్పీల్ చేశారు.
మాథ్యూస్ తన హెల్మెట్ పరిస్థితిని బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ కు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అంపైర్లు నిబంధనల ప్రకారం మాథ్యూస్ 'టైమ్ డ్ అవుట్' కింద అవుటైనట్టు ప్రకటించారు. మాథ్యూస్ తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడాడు. దాంతో ఒక్క బంతి ఆడకుండానే అవుటైనట్టయింది. క్రికెట్ చరిత్రలో ఈ విధంగా అవుటైన మొదటి బ్యాట్స్ మన్ గా ఏంజెలో మాథ్యూస్ రికార్డు పుటల్లోకి ఎక్కాడు.