Vijayasai Reddy: బెయిల్ రద్దు చేయమని చెప్పడంలో పురందేశ్వరి క్రిమినల్ మైండ్ అర్థమవుతోంది: విజయసాయిరెడ్డి
- విజయసాయి బెయిల్ రద్దు చేయాలంటూ సీజేఐకి పురందేశ్వరి లేఖ
- కోర్టుల్లో కోట్లాది కేసులు పేరుకు పోయాయన్న విజయసాయి
- బెయిల్ రద్దు చేయాలనడం అర్ధరహితమని విమర్శ
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. విజయసాయి బెయిల్ రద్దు చేయాలని, జగన్ పై ఉన్న కేసులను ఆరు నెలల్లో తేల్చాలని ఇటీవల పురందేశ్వరి సీజేఐకి లేఖ రాయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయసాయి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్వభావం, ఆలోచనా విధానాల్లోనే ఏదో తేడా ఉందని విమర్శించారు.
"దేశంలోని కోర్టుల్లో కోట్లాది సంఖ్యలో కేసులు పేరుకుపోయాయి. ఇప్పుడు పురందేశ్వరి బీజేపీలో ఉన్నారు. ఆమె పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఆమె అధికార పక్షానికి చెందిన నేత కాబట్టి... కోర్టుల్లో కేసులు పేరుకుపోవడం పట్ల సంస్కరణలు తీసుకువచ్చేందుకు పోరాడవచ్చు. కానీ కేసుల్లో బెయిల్ రద్దు చేయండి అని చెప్పడం ద్వారా పురందేశ్వరి క్రిమినల్ మైండ్ ఏంటనేది అర్ధం చేసుకోవచ్చు. కేసులు త్వరగా పరిష్కరించమని చెప్పే అవకాశం అధికార పక్షానికి చెందిన నేతగా ఆమె చేతుల్లో ఉంది. కేసులు త్వరగా పరిష్కారం కావాలని ఎవరికైనా ఉంటుంది. బెయిల్ రద్దు చేయాలని పురందేశ్వరి చెప్పడం అర్థరహితం" అని విజయసాయి స్పష్టం చేశారు.