Skill Development Case: స్కిల్ కేసులో మరొకరికి బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు!

SC grants Bail to one more accused in Skill case
  • సీమెన్స్ కంపెనీ డైరెక్టర్ సత్యభాస్కర్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు
  • మధ్యంతర బెయిల్ ను రెగ్యులర్ బెయిల్ గా మార్చిన ధర్మాసనం
  • ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్న చంద్రబాబు
ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తున్న స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మరో నిందితుడికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సీమెన్స్ ఇండియా కంపెనీ డైరెక్టర్ గంటి వెంకట సత్యభాస్కర్ ప్రసాద్ కు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది. గతంలో ఆయనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను పూర్తి స్థాయి బెయిల్ గా మారుస్తూ జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో సత్యభాస్కర్ ఏ 35గా ఉన్నారు. 

ఈ కేసులో తొలుత సత్యభాస్కర్ ను అరెస్ట్ చేసిన సీఐడీ... విజయవాడలోని ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచింది. పిటిషన్ ను విచారించిన ఏసీబీ కోర్టు నిందితుడికి అవినీతి నిరోధక చట్టం వర్తించదని పేర్కొంటూ రిమాండ్ విధించేందుకు నిరాకరించింది. దీంతో, ఏపీ హైకోర్టును సీఐడీ ఆశ్రయించగా... ఏసీబీ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోరుతూ సత్యభాస్కర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు జడ్జి జస్టిస్ సురేశ్ రెడ్డి నిరాకరించారు. దీంతో సత్యభాస్కర్ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఆగస్టు 22న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తాజాగా పూర్తి స్థాయి బెయిల్ ఇచ్చింది. 

మరోవైపు ఆరోగ్య కారణాలతో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ను ఇచ్చిన సంగతి తెలిసిందే.
Skill Development Case
Satya Bhaskar
Bail
Supreme Court

More Telugu News