Sri Lanka: శ్రీలంక బ్యాటర్ మాథ్యూస్ టైమ్డ్ అవుట్‌పై ప్రపంచవ్యాప్త చర్చ.. విమర్శల వెల్లువ
- శ్రీలంక బ్యాటర్ మాథ్యూస్ టైమ్డ్ అవుట్‌పై ప్రపంచవ్యాప్త చర్చ.. విమర్శల వెల్లువ
- క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటున్న దిగ్గజాలు
- ఇదెక్కడి అన్యాయమంటూ ప్రశ్నలు
- బ్యాటర్ బంతి కోసం మూడు నిమిషాలు వెయిట్ చేయొచ్చా? అని ప్రశ్న
- ప్రపంచ క్రికెట్లో ఇదే తొలి టైమ్డ్ అవుట్
- డొమెస్టిక్ క్రికెట్లో మాత్రం ఆరుసార్లు ఇలాంటి ఘటనలు
జెంటిల్మన్ గేమ్ క్రికెట్లో క్రీడాస్ఫూర్తిపై మరోమారు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రపంచకప్‌లో భాగంగా గతరాత్రి బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచే ఇందుకు కారణం. శ్రీలంక స్టార్ బ్యాటర్ ఏంజెలో మ్యాథ్యూస్ టైమ్డ్కు బాధితుడిగా మారి ప్రపంచ క్రికెట్ చరిత్రలో అలా అవుటైన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. 25వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన మాథ్యూస్.. తన హెల్మెట్ సరిగా లేకపోవడంతో మరో హెల్మెట్ కోసం వేచి చూశాడు. దీంతో నిర్ణీత సమయం మించిపోవడం, బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్ అంపైర్లకు ఫిర్యాదు చేయడం, వారు మాథ్యూస్‌ను టైమ్డ్ అవుట్‌గా ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. మాథ్యూస్ తాను ఎందుకోసం వేచి చూసిందీ వివరించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో అతడు మౌనంగా వెనుదిరగక తప్పలేదు.
మాథ్యూస్ టైమ్డ్ అవుట్‌పై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్, సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ డేల్ స్టెయిన్ వంటివారు ఈ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ ఘటన దయనీయమైనదని గంభీర్ ఎక్స్ ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇది ఎంతమాత్రమూ సరికాదని డేల్ స్టెయిన్ అభిప్రాయపడ్డాడు. మాథ్యూస్‌ను అవుటిచ్చిన తీరు క్రికెట్ స్పిరిట్‌కు ఎంతమాత్రమూ మంచిది కాదని లంక క్రికెటర్ అసలంక పేర్కొంటే.. ఇది క్రికెట్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని పాకిస్థాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ అన్నాడు. మ్యాథ్యూస్ క్రీజులోనే ఉన్నాడని, అతడి హెల్మెట్ పట్టీ విరిగిపోవడంతో టైమ్డ్ అవుట్ ఎలా ఇస్తారని ఆసీస్ బ్యాటర్ ఉస్మాన్ ఖావాజా ప్రశ్నించాడు. ఇది చాలా హాస్యాస్పదమని అన్నాడు. బ్యాటర్ క్రీజులోకి వచ్చి బంతిని ఎదుర్కొనేందుకు మూడు నిమిషాల సమయం పట్టడానికి భిన్నంగా ఏమీ లేదని పేర్కొన్నాడు.
టైమ్డ్ అవుట్ అంటే?
ఐసీసీ నిబంధనల ప్రకారం.. వికెట్ పడినప్పుడు తర్వాతి బంతిని ఎదుర్కొనేందుకు బ్యాటర్ రెండు నిమిషాల్లోనే క్రీజులోకి రావాల్సి ఉంటుంది. లేదంటే టైమ్డ్ అవుట్‌గా ప్రకటిస్తారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు ఇలాంటి ఘటన జరగలేదు. అయితే, దేశవాళీ క్రికెట్లో మాత్రం ఇలాంటివి ఆరు ఘటనలు ఉన్నాయి. 1997లో కటక్‌లో త్రిపుర-ఒరిస్సా మధ్య జరిగిన మ్యాచ్‌లో హేములాల్ యాదవ్ ఇలాగే టైమ్డ్ అవుట్ అయ్యాడు.