Roja: పురందేశ్వరి వంటి నీతిమాలిన కూతురు ఏ తండ్రికి పుట్టకూడదు: మంత్రి రోజా
- సీఎం జగన్ కేసులపై సుప్రీంకోర్టుకు లేఖ రాసిన పురందేశ్వరి
- పురందేశ్వరిని టార్గెట్ చేసిన వైసీపీ మంత్రులు, నేతలు
- పురందేశ్వరి ఒక జగత్ కిలాడీ అంటూ రోజా ఫైర్
- బావ కళ్లలో ఆనందం కోసం లేఖలు రాస్తోందని విమర్శలు
- నీకు నీతి, నిజాయతీ ఉన్నాయా? అంటూ మండిపాటు
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై మంత్రి రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పురందేశ్వరి ఒక జగత్ కిలాడీ అంటూ విమర్శించారు. బావ కళ్లలో ఆనందం కోసమే ఆమె లేఖలు రాస్తోందని అన్నారు.
"ఇవాళ రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందిస్తుంటే... పురందేశ్వరి మాత్రం జగన్ పై కక్ష సాధింపు ధోరణితో కేసులు రీ ఓపెన్ చేయాలని సుప్రీంకోర్టుకు లేఖ రాయడం మనమందరం చూశాం.
అమ్మా పురందేశ్వరీ... నీ పని నువ్వు చేసుకుంటే చాలు. జగన్ కేసులపై విచారణ జరపాలని నువ్వు చెప్పనక్కర్లేదు. నా మీద పెట్టిన అక్రమ కేసులను త్వరితంగా విచారించండి అంటూ జగనే పిటిషన్ వేసుకున్నారు. అదీ జగన్ నిజాయతీ... అదీ దమ్మున్న నాయకుడి లక్షణం. ఆ విషయం తెలుసుకో తల్లీ.
18 ఏళ్లు స్టేలు తెచ్చుకుంటూ వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ ఇంతవరకు చేసిన తప్పులపై విచారణ జరగనివ్వకుండా దొంగాటలు ఆడుతున్న చంద్రబాబుపై విచారణ జరపాలని... నీకు నీతి, నిజాయతీ ఉంటే సీబీఐకి లేఖ రాయాలి. అయినా నీకెక్కడ నీతి, నిజాయతీ వున్నాయి... నీకో నియోజకవర్గం లేదు, నీకు ఓటేసే వాళ్లు ఎవరూ లేరు. కానీ ఎన్టీఆర్ కూతురు అనే కార్డు వాడుకుంటూ పార్టీలు మారుతూ, అన్ని చోట్లా పదవులు అనుభవిస్తున్నావు.
ఎన్టీఆర్ గారికి నువ్వు కనీసం అన్నం పెట్టావా? పచ్చి మంచినీళ్లయినా ఇచ్చావా? ఆయన బతికుండగా ఓ కూతురిగా చేయాల్సిన సేవలు చేయలేదు కానీ, ఆయనకు వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబును మించిన జగత్ కిలాడీవి నువ్వు. ఆ రోజు సీఎం పదవి కోసం నువ్వు, చంద్రబాబు ఎలా కొట్లాడుకున్నారో రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు.
కానీ, పురందేశ్వరి ఈ రోజు బావ కళ్లలో ఆనందం కోసం, బావ రాసిచ్చిన స్క్రిప్టులను మీడియా ముందు ఏ విధంగా మాట్లాడుతుందో, ఏ విధంగా లేఖల రూపంలో సుప్రీంకోర్టుకు రాస్తుందో అందరం చూస్తున్నాం. నిజంగా ఇలాంటి కూతురు పుట్టినందుకు ఎన్టీఆర్ గారు కుమిలి కుమిలి ఏడుస్తుంటారు. ఏ తండ్రికి కూడా ఇలాంటి నీతిమాలిన కూతురు పుట్టకూడదు అని కోరుకుంటున్నాను. ఎందుకంటే, ఈమెకు పదవులు, డబ్బుపై ఆశ తప్ప మరే ఆలోచన లేదు" అంటూ రోజా నిప్పులు చెరిగారు.