Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్‌లో చేరడానికి ముందే ఐటీ దాడులు వంటి ఇబ్బందులు ఊహించా!: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- తనపైనా, తన కుటుంబంపైనా ఐటీ దాడులకు అవకాశముందన్న పొంగులేటి
- కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగవచ్చునని అనుమానం
- ఎన్నికల వరకు కాంగ్రెస్ నాయకులకు ఈ ఇబ్బందులు తప్పవన్న కాంగ్రెస్ నేత
- కాళేశ్వరంపై కేంద్ర సంస్థ నివేదిక ఇచ్చినా ఇంకా చర్యలు తీసుకోలేదని వ్యాఖ్య
తనపైనా, తన కుటుంబం పైనా ఐటీ దాడులకు అవకాశముందని పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ నాయకుల ఇళ్లపై ఐటీ సోదాలు జరగవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటై తనపై ఐటీ దాడులకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇలాంటి ఇబ్బందులు తప్పవన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే ఈ పార్టీలో చేరితే బీజేపీ లేదా బీఆర్ఎస్ ఇబ్బంది పెడుతుందని ఉహించానన్నారు.
కేసీఆర్ అవినీతి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు లీకులు వెంటాడుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యాల గురించి కేంద్ర సంస్థలు నివేదిక ఇచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కొందరు పోలీసులు, అధికారులు బీఆర్ఎస్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.