Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆరోపణలు
- టీపీసీసీ చీఫ్ టిక్కెట్లు అమ్ముకున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారన్న కేసీఆర్
- పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్నారంటే ఎంత గొప్పవాళ్లోనని ఎద్దేవా
- అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్కు ఓటు వేయాలన్న కేసీఆర్
టీపీసీసీ అధ్యక్షుడు టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని, అందుకే గాంధీ భవన్ గేట్లకు తాళాలు వేసి ఆందోళన చేపడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బెల్లంపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టికెట్లు అమ్ముకునేవాళ్లకు రాష్ట్రాన్ని అప్పగిస్తే రేపు రాష్ట్రాన్ని అమ్మివేయరా? అని ప్రశ్నించారు. పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారు అంటే వారు ఎంత గొప్పవాళ్లో... అని ఎద్దేవా చేశారు. ఇలాంటి నాయకులు మనకు కావాలా? లేక ప్రజల కోసం పనిచేసే బీఆర్ఎస్ పార్టీ కావాలా? దయచేసి ఆలోచించాలని సూచించారు. ప్రజల దీవెనలతో తెలంగాణను ఈ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
కాంగ్రెస్ నేతలు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెబుతున్నారని, రైతుబంధు దుబారా అని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణిని తీసివేయవద్దంటే... రైతుబంధు ఇలాగ కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యను గెలిపించాలన్నారు. దుర్గం చిన్నయ్య లాంటి వాళ్లు గెలిస్తేనే రేపు రాష్ట్రంలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు. అప్పుడు రైతుబంధు ఎప్పటిలాగే వస్తుందన్నారు. మనం ఇక్కడ 24 గంటల విద్యుత్ ఇస్తుంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంటు చాలని చెబుతున్నాడని విమర్శించారు. 24 గంటల విద్యుత్ కొనసాగాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు.
కాంగ్రెస్ ఎప్పుడూ రైతుల గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధును అమలు చేస్తున్నామని, రైతుబీమా ఇస్తున్నామన్నారు. తాగునీరు, సాగునీటి సమస్యను పరిష్కరించుకున్నామన్నారు. తెలంగాణలో ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నామన్నారు. ఇదే అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని, దయచేసి అందరూ ఆలోచన చేయాలన్నారు. ధరణి వచ్చాక భూముల క్రయ విక్రయాల్లో అవినీతి లేదన్నారు.