Unique ID: అలర్ట్.. ప్రజలకు మరో యూనీక్ ఐడీ తేనున్న కేంద్ర ప్రభుత్వం!
- మొబైల్ యూజర్ల కోసం త్వరలో ప్రత్యేక గుర్తింపు సంఖ్య
- యూజర్ల సిమ్ కార్డులు, ఫోన్ల వివరాలు గుర్తింపు సంఖ్యతో అనుసంధానం
- యూనీక్ ఐడీతో ఫేక్ సిమ్‌ల బెడదకు చెక్
- డిజిటల్ భద్రత పెంపొందించే లక్ష్యంగా యూనీక్ ఐడీ తీసుకురానున్న కేంద్రం
సిమ్ కార్డు మోసాలకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్రం దేశంలోని మొబైల్ యూజర్ల కోసం ఓ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను త్వరలో ప్రారంభించనుంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ (ఏబీహెచ్ఏ) మాదిరి మొబైల్ యూజర్లకు ఈ ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించనుంది. యూజర్ల మొబైల్ కనెక్షన్లకు సంబంధించిన వివరాలను ఈ ఐడీతో జత చేస్తారు. వ్యక్తుల వద్ద ఉన్న ఫోన్లు, ఎన్ని సిమ్‌కార్డులు యజర్ పేరిట రిజిస్టర్ అయి ఉన్నాయి, ఏయే సిమ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయి అనే వివరాలను అనుసంధానిస్తారు. యూజర్ల వివరాలను ఓచోట కేంద్రీకృతం చేసే దిశగా ప్రభుత్వం ఈ ఐడీని తీసుకురానుంది.
ఏబీహెచ్ఏ విధానంలోనే మొబైల్ యూజర్ల గుర్తింపు సంఖ్య ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏబీహెచ్ఏ అకౌంట్లో ప్రజల మెడికల్ రికార్డులు ఉన్నట్టే మొబైల్ యూజర్ ఐడీతో ఫోన్, సిమ్ కార్డుల వివరాలు జత చేస్తారని పేర్కొన్నారు. నకిలీ సిమ్‌ల బెడద, బల్క్‌లో సిమ్ కార్డుల కొనుగోళ్లు వంటి అక్రమాలకు చెక్ పెట్టి డిజిటల్ భద్రత పెంపొందించేందుకు ప్రభుత్వం ఈ కొత్త గుర్తింపు సంఖ్యను ప్రారంభించనుంది. కొత్త సిమ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భంలో ఈ యూనిక్ ఐడీని కేటాయిస్తారు.