KCR: అందుకే కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నాను: ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్
- గంపా గోవర్ధన్ పలుమార్లు కోరడంతో కామారెడ్డికి వచ్చినట్లు వెల్లడి
- కామారెడ్డితో తనకు పుట్టినప్పటి నుంచే అనుబంధం ఉందన్న కేసీఆర్
- ఉద్యమం సమయంలో జలసౌధ ఉద్యమం చేశామని గుర్తు చేసుకున్న కేసీఆర్
- గెలిపిస్తే కామారెడ్డిని అద్భుత నియోజకవర్గంగా మారుస్తానని హామీ
కామారెడ్డి నియోజకవర్గంతో తనకు పుట్టినప్పటి నుంచి అనుబంధం ఉందని, తన తల్లి పుట్టింది ఈ నియోజకవర్గంలోని కోనాపూర్‌గా పిలిచే పోసానిపల్లి గ్రామంలోనే అని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తొలుత గజ్వేల్, ఆ తర్వాత కామారెడ్డి నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమం సమయంలో 45 రోజుల పాటు ఇక్కడ జలసౌధ ఉద్యమం చేశామని గుర్తు చేసుకున్నారు. ఇక్కడి లాయర్లు ఉద్యమం సమయంలో చైతన్యం చూపారన్నారు. కామారెడ్డిని జిల్లాగా చేస్తామని గత పాలకులు హామీ ఇచ్చారని, కానీ నెరవేర్చలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో జిల్లాగా చేయడంతో పాటు ఇక్కడికి మెడికల్ కాలేజీని తెచ్చామన్నారు.
కామారెడ్డి నుంచి పోటీ చేయాలని ఇక్కడి ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ తనను పలుమార్లు కోరారని, దీంతో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. తాను కామారెడ్డికి వస్తున్నానంటే తాను ఒక్కడినే రానని, తన వెంబడి ఎన్నో వస్తాయన్నారు. ఇక్కడి పల్లె, పట్టణాల రూపురేఖలు మార్చే బాధ్యత తనదే అన్నారు. యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ మన నెత్తిన ఎన్నో సమస్యలు పెట్టిందన్నారు. కానీ బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం... తెలంగాణ ప్రజల కోసమన్నారు. తమాషాగా ఓటు వేయవద్దని, బాగా ఆలోచించుకొని వేయాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు నీళ్లు తెస్తామన్నారు. దాదాపు రెండేళ్లలో రెండు ప్రాంతాల్లో నీళ్లు పారిస్తామన్నారు. విద్యాసంస్థలను, అనేక పరిశ్రమలను తీసుకు వస్తామన్నారు. కామారెడ్డిని అద్భుత నియోజకవర్గంగా మార్చి చూపిస్తానన్నారు.