Nadendla Manohar: జనసేన-టీడీపీ ఉమ్మడి కార్యాచరణపై నాదెండ్ల మనోహర్ స్పందన
- విజయవాడలో నోవోటెల్ హోటల్లో జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ భేటీ
- సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన నాదెండ్ల
- రాష్ట్రంలోని కరవు పరిస్థితులపై తీర్మానం చేశామని వెల్లడి
జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నేడు విజయవాడలో జరిగింది. నోవోటెల్ హోటల్ లో ఈ కీలక భేటీ ముగిసిన అనంతరం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు.
నేటి సమన్వయ కమిటీ సమావేశంలో రాష్ట్రంలోని కరవు పరిస్థితులపై చర్చించి తీర్మానం చేశామని వెల్లడించారు. జనసేన, టీడీపీ రైతులకు అండగా నిలుస్తాయని, రాష్ట్రంలోని కరవు మండలాల్లో పర్యటించి రైతులకు అందాల్సిన సాయం సక్రమంగా చేరేలా పోరాడాలని తీర్మానం చేసినట్టు వివరించారు.
కరవు పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నా దేవుడి దయతో అంతా బాగుందని రాష్ట్ర పాలకుడు చెప్పడం పచ్చి అబద్ధం అని విమర్శించారు. ఖరీఫ్ సమయంలో 32.42 శాతం వర్షపాతం నమోదు కావడం, లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందనేది వాస్తవం అని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 25 లక్షల ఎకరాల్లో కనీసం సాగు కూడా చేయలేదని తెలిపారు. ప్రకృతి వైపరీత్యం వల్ల నెలకొన్న కరవుతో పాటు పాలక పక్షం నిర్లక్ష్య ధోరణులతోనూ రైతాంగం నష్టపోయిందని అన్నారు.
సకాలంలో సాగు నీరు ఇవ్వకపోవడంతో పశ్చిమ కృష్ణా డెల్టా ప్రాంతంలో పంటలు దెబ్బతిన్నాయని, సాగు నీటి విడుదలలో, కాలువల నిర్వహణలో అధికార యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా ఉందని నాదెండ్ల పేర్కొన్నారు. ఈ దుర్భర పరిస్థితుల్లో కరవు మండలాలను గుర్తించి ప్రకటించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.
"నిబంధనల మేరకు కరవును లెక్కిస్తే 449 మండలాలను ప్రకటించాల్సి ఉంది. కేవలం 103 మండలాలనే కరవు మండలాలుగా గుర్తించడం రైతులను మోసగించడమే. వర్షాభావం కారణంగా, సాగు నీరు అందకపోవడం వల్ల పంటలు కోల్పోయిన అన్ని మండలాలను కరవు మండలాలుగా గుర్తించాలి. రాష్ట్రవ్యాప్తంగా నష్టపోయిన రైతాంగానికి ఇన్ పుట్ సబ్సిడీ రూపంలో పంట నష్టపరిహారాన్ని అందజేయాలి. పంట బీమా అంశంపై ఉన్న అయోమయాన్ని తొలగించి, బీమాను తక్షణమే చెల్లించేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు నేటి సమావేశం ద్వారా జనసేన-టీడీపీ డిమాండ్ చేస్తున్నాయి" అని నాదెండ్ల వివరించారు.