KCR: కేసీఆర్ అఫిడవిట్లో ఆస్తులు.. అప్పుల వివరాలివీ!

KCR files affidavit in gajwel and kamareddy
  • బ్యాంకులో తమకు రూ.17 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు కేసీఆర్ వెల్లడి
  • 2.8 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయన్న కేసీఆర్
  • ట్రాక్టర్, హార్వేస్టర్, జేసీబీ ఉన్నట్లు వెల్లడించిన బీఆర్ఎస్ అధినేత
  • రూ.17.27 కోట్ల అప్పు వున్నట్టు వెల్లడి 
  • తనది రైతు కుటుంబంగా పేర్కొన్న ముఖ్యమంత్రి
బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కేసీఆర్ నామినేషన్ పత్రాల్లో సమర్పించిన వివరాల ప్రకారం ఆయనపై తొమ్మిది కేసులు ఉన్నాయి. తన చేతిలో రూ.2 లక్షల 96 వేల నగదు ఉన్నట్లు తెలిపారు. తన పేరు మీద, తన భార్య శోభ పేరు మీద బ్యాంకులలో రూ.17 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నట్లు తెలిపారు. కేసీఆర్ పేరు మీద తొమ్మిది బ్యాంకు ఖాతాలు, శోభ పేరు మీద మూడు బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు తెలిపారు. గత అయిదేళ్లలో బ్యాంకు డిపాజిట్లు రెండింతలు అయినట్లు పేర్కొన్నారు.

2018 ఎన్నికల సమయంలో సమర్పించిన పత్రాల ప్రకారం ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్స్ కలిపి రూ.5.63 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.11.16 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. కేసీఆర్ భార్య చేతిలో రూ.6.29 కోట్లు ఉన్నట్లు తెలిపారు. రూ.17 లక్షల విలువ చేసే 2.8 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. స్థిరాస్తుల రూపంలో రూ.17.83 కోట్లు, చరాస్తుల రూపంలో రూ.9.67 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. భార్య శోభ పేరు మీద రూ.7.78 కోట్ల విలువ చేసే చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి ఆస్తిగా రూ.9.81 కోట్ల చరాస్తులు ఉన్నాయన్నారు.

తన పేరు మీద రూ.17.27 కోట్ల అప్పు, కుటుంబం పేరు మీద రూ.7.23 కోట్ల అప్పు ఉందని అఫిడవిట్లో వెల్లడించారు. తనకు సొంత కారు, బైక్ లేవని తెలిపారు. ట్రాక్టర్లు, జేసీబీ, హార్వెస్టర్లు తదితర పద్నాలుగు వాహనాలు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటి విలువ రూ.1.16 కోట్లుగా తెలిపారు.

తనది రైతు కుటుంబమని అఫిడవిట్లో కేసీఆర్ పేర్కొన్నారు. అయితే తన పేరు మీద సెంటు భూమి లేదని వెల్లడించారు. భార్య శోభ పేరు మీద కూడా భూములు చూపించలేదు. తమకు ఉన్న భూమిని కుటుంబ ఆస్తిగా చూపించారు. కుటుంబానికి ఉమ్మడిగా 62 ఎకరాలు ఉండగా, ఇందులో 53.30 ఎకరాలు సాగుభూమి కాగా, 9.36 ఎకరాల వ్యవసాయేతర భూమి ఉన్నట్లు తెలిపారు.
KCR
Telangana Assembly Election
BRS
gajwel
Kamareddy District

More Telugu News