KTR: రేవంత్‌రెడ్డిపై ఈయనను గెలిపిస్తే కేసీఆర్ కాళ్లు పట్టుకొనైనా ప్రమోషన్ ఇప్పిస్తా: కేటీఆర్
- రేవంత్ అంతర్జాతీయస్థాయిలో కొడంగల్‌కు చెడ్డపేరు తెచ్చారన్న కేటీఆర్
- రేవంత్ రెడ్డి లీడర్లను కొంటున్నాడు కానీ కొడంగల్ ప్రజలను కొనలేడని వ్యాఖ్య
- జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా? జైలుకెళ్లే ఎమ్మెల్యే కావాలా? అని ప్రశ్న
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ పేరును అంతర్జాతీయస్థాయిలో చెడగొట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. రూ.50 లక్షలతో అడ్డంగా దొరికిన దొంగ అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్ మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి పైసలను నమ్ముకున్నాడని, అందుకే లీడర్లను కొంటున్నారని ఆరోపించారు. రేవంత్ లీడర్లను కొనవచ్చు.. కానీ కొడంగల్ ప్రజలను కొనలేడన్నారు. జనంలో ఉండి అభివృద్ధి చేసే ఎమ్మెల్యే కావాలా? జైలుకు వెళ్లే ఎమ్మెల్యే కావాలా? అన్నారు. ఇక్కడి నుంచి నరేందర్ రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ కాళ్లు పట్టుకొని అయినా ఆయనకు ప్రమోషన్ ఇప్పిస్తానన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కానీ కరెంట్ పోయిందన్నారు. కర్ణాటక రైతులు కొడంగల్ వచ్చి నిరసన తెలిపారని గుర్తు చేశారు. అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు బాధపడుతున్నారన్నారు. తెలంగాణలో మనం 24 గంటల విద్యుత్ ఇస్తుంటే కాంగ్రెస్ అక్కడ 5 గంటలు ఇస్తోందన్నారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా ముందుకు సాగుతోందన్నారు. రెండేళ్లలో కొడంగల్‌లో 1.25 లక్షల ఎకరాలకు కృష్ణా నీటిని మళ్లిస్తామన్నారు. మద్దూరును మున్సిపాలిటీగా చేస్తానని చెప్పారు. కొడంగల్‌లో ఆర్డీవో కార్యాలయం, 100 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు, ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు.
కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. కొడంగల్‌ను అద్భుత నియోజకవర్గంగా చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పద్దెనిమిదేళ్లు నిండిన ఆడబిడ్డల కోసం కొత్త కార్యక్రమాలు తీసుకువస్తామన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద ప్రతి ఆడపిల్ల ఖాతాలో రూ.3వేలు వేస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ ధరను రూ.400కే ఇస్తామన్నారు. తెల్ల కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల బీమా ఇస్తామన్నారు.