Bandi Sanjay: బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ వచ్చినా కొన్ని రోజుల్లో కూలిపోతుంది... వారే కూల్చేస్తారు: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
- బీఆర్ఎస్ గెలిచినా కల్వకుంట్ల కుటుంబ సభ్యులే ప్రభుత్వాన్ని కూలగొడతారని వ్యాఖ్య
- కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి కోసం ఆ పార్టీ నేతలు కూల్చేస్తారన్న బండి సంజయ్
- సుస్థిర ప్రభుత్వం కోసం బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి
- కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ తెలంగాణకు దరిద్రంలా దాపురించాయని ఆగ్రహం
బీసీ ముఖ్యమంత్రి కావాలంటే బీజేపీని గెలిపించాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా జిన్నారంలో సింహగర్జన బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సుస్థిర ప్రభుత్వం కోసం బీజేపీని గెలిపించాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీజేపీ హవా ఉందన్నారు. బీఆర్ఎస్ గెలవదని, ఒకవేళ ఆ ప్రభుత్వం వచ్చినా ఎక్కువ రోజులు ఉండదని బాంబు పేల్చారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యులే ప్రభుత్వాన్ని కూలగొడతారన్నారు. మళ్లీ ఎన్నికలు వస్తాయన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి పదవి కోసం ప్రభుత్వాన్ని పడగొడతారన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజల్లో ఉండే వ్యక్తులకు టిక్కెట్ ఇవ్వాలి.. కానీ దోస్తులకు టిక్కెట్ ఇస్తారా? అని ప్రశ్నించారు. ఖానాపూర్‌లో జాన్సన్ గెలిస్తే ఆయనను కలవడానికి అందరూ పాస్ పోర్టులు తీసుకోవాలన్నారు.
కేసీఆర్ లేకుంటే కేటీఆర్‌ది బిచ్చపు బతుకు అని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబం బండారం బయట పెట్టేవరకు వదిలేది లేదన్నారు. నెలకు కోటి రూపాయల వేతనం వదిలేసి వచ్చిన కేటీఆర్ ఇప్పుడు లక్షల కోట్లు ఎలా సంపాదించారు? అని ప్రశ్నించారు. కేసీఆర్ తన పాలనలో రూ.5 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. తెలంగాణలో తలసరి అప్పు రూ.20 వేలుగా ఉందన్నారు. నెల నెలా ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు భూములు అమ్మడం, మద్యం షాపులు పెంచడం, అప్పులు తేవడం చేస్తున్నారన్నారు.
పోడు భూముల పేరిట ఏజెన్సీలో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. పోడు భూముల కోసం కొట్లాడితే బీజేపీ కార్యకర్తలపై దాడులు చేశారని, జైల్లో పెట్టించారని మండిపడ్డారు. రైతు పండించిన ప్రతి గింజను కేంద్రమే కొనుగోలు చేస్తోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ తెలంగాణకు దరిద్రంలా దాపురించాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్‌కు అమ్ముడుపోవడం ఖాయమన్నారు. తెలంగాణలోని ఎనభై శాతం హిందువులు ఏకమైతే రామరాజ్యం వస్తుందన్నారు. ఖానాపూర్‌లో రాథోడ్ రమేశ్ గెలుపు ఖాయమన్నారు.