Nara Lokesh: మునిరత్నం నాయుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: నారా లోకేశ్

Nara Lokesh responds to attack on TDP leader in Chandragiri constituency
  • చంద్రగిరి మండలంలో టీడీపీ నేత మునిరత్నం నాయుడుపై దాడి
  • వైసీపీ ఫ్యాక్షన్ పాలన సాగిస్తోందన్న నారా లోకేశ్
  • ఇలాంటి దాడులతో టీడీపీని భయపెట్టలేరన్న అచ్చెన్నాయుడు
వైసీపీ నేతల్లో అసహనం పెరిగిపోతోందని, ఓటమి భయంతో వారు టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. 

తాజాగా చంద్రగిరి మండలం భీమవరంలో మునిరత్నం నాయుడుపై వైసీపీ నేతలు దాడి చేశారని ఆరోపించారు. మునిరత్నం నాయుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. మునిరత్నం నాయుడు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని నారా లోకేశ్ భరోసానిచ్చారు. వైసీపీ ఫ్యాక్షన్ పాలన సాగిస్తోందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. 

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా మునిరత్నం నాయుడుపై దాడి ఘటనను ఖండించారు. టీడీపీ నేత మునిరత్నం నాయుడుపై వైసీపీ గూండాలు దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. మద్యం, గంజాయి మత్తులో చెవిరెడ్డి అనుచరులు దాడికి దిగారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. సీఎం గాల్లో తిరుగుతూ శాంతిభద్రతలను గాలికి వదిలేశారని విమర్శించారు. 

ఎన్ని దాడులు చేసినా టీడీపీ వెనుకడుగు వేయదన్న విషయం గుర్తించాలని స్పష్టం చేశారు. మునిరత్నం నాయుడుపై దాడి చేసిన వైసీపీ నేతలపై ఎస్పీ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మునిరత్నం కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు.
Nara Lokesh
Munirathnam Naidu
Chandragiri
Atchannaidu
TDP
YSRCP

More Telugu News