Harish Rao: కేసీఆర్ సెంచరీ కొట్టి మరోసారి అధికారంలోకి వస్తారు: హరీశ్ రావు
- బీజేపీ డకౌట్... కాంగ్రెస్ రనౌట్.. అవుతుందన్న హరీశ్ రావు
- కేసీఆర్ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నారన్న మంత్రి
- ఇతర పార్టీలు గెలిస్తే అభివృద్ధి జరగదన్న హరీశ్ రావు
కేసీఆర్ సెంచరీ కొట్టి మరోసారి అధికారంలోకి వస్తారని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. నర్సాపూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి నామినేషన్ ప్రక్రియలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డకౌట్... కాంగ్రెస్ రనౌట్ అవుతుందని... బీఆర్ఎస్ సెంచరీ కొడుతుందన్నారు. కేసీఆర్ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నారని, ఇవ్వని వాటిని కూడా నెరవేర్చారన్నారు. గతంలో పదిసార్లకు పైగా కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే చేసింది శూన్యమన్నారు. బీజేపీకి 2018 ఎన్నికల్లో ఒకటే సీటు వచ్చిందని, ఇప్పుడు డిపాజిట్లు రావన్నారు. కేసీఆర్ సెంచరీ కొట్టి మూడోసారి అధికారంలోకి వస్తారన్నారు.
కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్ చెబుతారని, ఉత్తమ్ కుమార్ రెడ్డేమో అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తీసుకోనని అంటారని, కానీ తెలంగాణ ప్రజానీకం కేసీఆర్‌ను కాదని ఇతర పార్టీలకు ఓటు వేయదన్నారు. బీఆర్ఎస్ గెలుపు కోసం అందరూ కృషి చేయాలన్నారు. నర్సాపూర్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఇప్పటి వరకు సర్పంచ్ కూడా కాలేదన్నారు. రాష్ట్రంలో ఇతర పార్టీలు గెలిస్తే అభివృద్ధి జరగదన్నారు. బీఆర్ఎస్ గెలవాల్సిందే అన్నారు.
కేసీఆర్ చేతిలో తెలంగాణ భద్రం
తల్లి చేతిలో బిడ్డలా... కేసీఆర్ చేతిలోనే తెలంగాణ భద్రంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్‌కు రాష్ట్ర ప్రజల మీద ప్రేమ తక్కువ.. అధికారం మీద యావ ఎక్కువ అన్నారు. అబద్ధాలతో అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్‌తో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పదికి పది మనమే గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ వచ్చి అక్కడ ఐదు గంటల విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పారని, కానీ మన వద్ద ఎనిమిది ఏళ్లుగా వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా కరెంట్ ఇస్తున్నామన్నారు. రైతుబంధు సృష్టి కర్త కేసీఆర్ అన్నారు.