Rivers Interlinking: నదుల అనుసంధానంపై హైదరాబాదులో టాస్క్ ఫోర్స్ సమావేశం... వివరాలు ఇవిగో!
- సమావేశానికి హాజరైన తెలుగు రాష్ట్రాల నీటి పారుదల శాఖల కార్యదర్శులు
- పలు రాష్ట్రాల నీటి పారుదల శాఖల కార్యదర్శులు కూడా హాజరు
- గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరీ నదుల అనుసంధానంపై చర్చ
- ట్రైబ్యునల్ కేటాయింపులపై అభిప్రాయాలు తెలిపిన తెలంగాణ
- పలు ప్రతిపాదనలు చేసిన ఏపీ
నదుల అనుసంధానంపై హైదరాబాదులో టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులతో పాటు, పలు రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరీ నదుల అనుసంధానంపై చర్చించారు. కెన్-బెత్వా ప్రాజెక్టు, పర్బతి-కలిసింద్-చంబల్ ప్రాజెక్టులపైనా చర్చ జరిగింది.
ట్రైబ్యునల్ కేటాయింపులపై తెలంగాణ తన అభిప్రాయాలను వెల్లడించింది. కేటాయింపులకు ఇబ్బంది లేనంత వరకు గోదావరి జలాల తరలింపునకు అభ్యంతరం లేదని పేర్కొంది. గోదావరి-కావేరీ అనుసంధానంలో ప్రతిపాదిత వాటా కంటే ఎక్కువ కావాలని డిమాండ్ చేసింది. వీలైనంత ఎక్కువగా భూసేకరణ ఉండాలని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టులో ప్రతిపాదిత డ్యామ్ ఇచ్చంపల్లికి ఎగువన ఉంటే, సమ్మక్క ఆనకట్ట బ్యాక్ వాటర్స్ తో ఇబ్బంది ఉండదని తెలంగాణ నీటి పారుదల శాఖ తెలిపింది.
దీనిపై నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ చైర్మన్ వెదిరె శ్రీరామ్ స్పందిస్తూ... ఎక్కువ నీటి వాటా కావాలన్న తెలంగాణ విజ్ఞప్తిని ఎన్ డబ్ల్యూడీఏ (నేషనల్ వాటర్ డెవలప్ మెంట్ ఏజెన్సీ) పరిశీలిస్తుందని తెలిపారు. నదుల అనుసంధానం తొలి దశలో 400 హెక్టార్ల భూసేకరణ అవసరం అని వెల్లడించారు. భూ నిర్వాసితులకు ఉత్తమ ప్యాకేజి ఉంటుందని అన్నారు. ఎన్ డబ్ల్యూడీఏ బృందం ఇచ్చంపల్లి ప్రాంతాన్ని సందర్శిస్తుందని వివరించారు. సమ్మక డ్యామ్ బ్యాక్ వాటర్స్ ప్రభావం లేకుండా నిపుణులు చర్యలు తీసుకుంటారని తెలిపారు.
ఈ సమావేశంలో ఏపీ నీటి పారుదల శాఖ కూడా తన అభిప్రాయాలను వెల్లడించింది. గోదావరి మిగులు జలాలు కాకుండా ఛత్తీస్ గఢ్ వినియోగించుకోని జలాలను తరలించాలని ప్రతిపాదించింది. సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్) తాజా అధ్యయనాలను ఎన్ డబ్ల్యూడీఏ పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. సాగర్, సోమశిల ప్రాజెక్టులు, ప్రస్తుత ఆయకట్టు, కొత్త అవసరాలు తీర్చడంపై అధ్యయనం చేపట్టాల్సి ఉందని ఏపీ అభిప్రాయపడింది.
ప్రాజెక్ట్ సాంకేతిక అంశాలపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని, అందులో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని స్పష్టం చేసింది. దిగువ రాష్ట్రంలో ప్రయోజనాలను పరిరక్షిస్తామన్న హామీ కావాలని డిమాండ్ చేసింది. గోదావరి నీటి మళ్లింపునకు ఇచ్చంపల్లికి బదులుగా పోలవరం ప్రాజెక్టును పరిశీలించాలని సూచించింది.
ఏపీ అభిప్రాయాలపై టాస్క్ ఫోర్స్ చైర్మన్ వెదిరె శ్రీరామ్ స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మిగులు జలాలను వాడుకునేది లేదని తేల్చి చెప్పారు. సాంకేతిక అంశాలపై ఏపీ ప్రభుత్వంతో ఎన్ డబ్ల్యూడీఏ ప్రత్యేకంగా సమావేశం అవుతుందని తెలిపారు. సాగర్, సోమశిల ప్రాజెక్టుల సామర్థ్యంపై ఎన్ డబ్ల్యూడీఏ అధ్యయనం చేయాల్సి ఉంటుందని అన్నారు. దిగువ రాష్ట్రం ఏపీ ప్రయోజనాలకు, హక్కులకు ఎలాంటి భంగం కలగదని వెదిరె శ్రీరామ్ స్పష్టం చేశారు.
ఇచ్చంపల్లి నుంచి సాగర్ కు కాలువ తెలంగాణ ప్రయోజనాలకు లోబడి ఉంటుందని పేర్కొన్నారు. ఇచ్చంపల్లి ప్రతిపాదన మొదటి దశ మాత్రమేనని, తదుపరి దశల్లో పోలవరం ప్రతిపాదన పరిశీలిస్తామని తెలిపారు. ఒప్పందంపై సంతకాలకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు సంసిద్ధత వ్యక్తం చేశామని వెదిరె శ్రీరామ్ వెల్లడించారు.
కాగా, నదుల అనుసంధానం ప్రాజెక్టుకు కర్ణాటక, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర పూర్తి మద్దతు తెలిపాయి.