Pakistan: ఇంగ్లండ్ స్కోరు 337 రన్స్... పాక్ పరిస్థితి చూస్తే అయ్యో పాపం అంటారు!
- వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ × పాకిస్థాన్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- 50 ఓవర్లలో 9 వికెట్లకు 337 పరుగులు
- పాక్ సెమీస్ చేరాలంటే 6.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాల్సిన వైనం
ఈ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పరిస్థితి చూస్తే అయ్యో పాపం అనిపించకమానదు! టోర్నీలో ఇప్పటికే 3 జట్లు సెమీస్ చేరగా, నాలుగో బెర్తుకు న్యూజిలాండ్ దాదాపు చేరువలో నిలిచింది. సాంకేతికంగా చూస్తే పాకిస్థాన్ కు కూడా సెమీస్ అవకాశాలు ఉన్నప్పటికీ, అది కార్యరూపం దాల్చడం అయ్యే పని కాదు.
ఎందుకంటే... ఇవాళ పాకిస్థాన్ తో మ్యాచ్ లో ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 337 పరుగులు చేసింది. ఇప్పుడు పాక్ సెమీస్ చేరాలంటే 338 పరుగుల లక్ష్యాన్ని 6.4 ఓవర్లలోనే ఛేదించాలి. అప్పుడు గానీ న్యూజిలాండ్ ను పాయింట్ల పట్టికలో వెనక్కి నెట్టేయగల రన్ రేట్ పాకిస్థాన్ కు లభించదు. ఇది జరిగే పనేనా...? దాంతో, పాక్ ఈ మ్యాచ్ పై ఎప్పుడో ఆశలు వదులుకుంది.
ఇక, లక్ష్యఛేదనలో పాక్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ తొలి ఓవర్లోనే డకౌట్ అయ్యాడు. ఈ వికెట్ డేవిడ్ విల్లీకి దక్కింది. ప్రస్తుతం పాక్ 2 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది. ఓపెనర్ ఫఖార్ జమాన్ 1, కెప్టెన్ బాబర్ అజామ్ 8 పరుగులతో ఆడుతున్నారు.
అంతకుముందు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో బెన్ స్టోక్స్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్టోక్స్ 76 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 84 పరుగులు చేశాడు. రూట్ 60 పరుగులతో రాణించాడు. కెప్టెన్ జోస్ బట్లర్ 27 పరుగులు చేయగా... యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 30 పరుగులు చేశాడు. చివర్లో విల్లీ 5 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 15 పరుగులు చేశాడు. పాకిస్థాన్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 3, షహీన్ అఫ్రిది 2, మహ్మద్ వసీం జూనియర్ 2, ఇఫ్తికార్ అహ్మద్ 1 వికెట్ తీశారు.