Israel: ఇజ్రాయెల్‌కు షాకిచ్చిన భారత్!

India votes in favour of UN resolution against Israeli settlements in Palestine
  • పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయెలీ నివాసాల ఏర్పాటును ఖండిస్తూ యూఎన్‌లో తీర్మానం
  • తీర్మానానికి అనుకూలంగా 145 దేశాలు, వ్యతిరేకంగా 7 దేశాల ఓటు
  • భారత్ కూడా తీర్మానానికి అనుకూలంగా ఓటు
  • కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ
ఇజ్రాయెల్‌కు భారత్ ఊహించని షాకిచ్చింది. తూర్పు జెరూసెలం, సిరియన్ గోలన్ సహా పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయెలీ నివాసాల ఏర్పాటును ఖండిస్తూ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఓటు వేసింది. మొత్తం 145 సభ్యుల దేశాలు గురువారం ఈ తీర్మానాన్ని ఆమోదించగా 18 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. కెనడా, హంగరీ, ఇజ్రాయెల్, మార్షల్ ఐలాండ్స్, ఫెడరేషన్ ఆఫ్ మైక్రోనేసియా, నౌరూ, అమెరికా ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశాయి. 

కాగా, ఇజ్రాయెల్ తీరును ఐక్యరాజ్య సమితిలో భారత్ ఖండించడాన్ని తృణమూల్ ఎంపీ సాకేత్ గోఖలే స్వాగతించారు. ఐరాసా తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేసినందుకు సంతోషంగా ఉందంటూ ఆయన సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. తీర్మానం ఫొటో కూడా ఆయన నెట్టింట పంచుకున్నారు. పాలస్తీనా భూభాగాల ఆక్రమణ చట్టబద్ధం కాదని స్పష్టం చేశారు. 

కాగా, గతనెలలో ఐక్యరాజ్యసమితిలో జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ కు భారత్ దూరంగా ఉండిపోయింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య సంధి కోరుతూ జోర్డాన్ ఈ రిసొల్యూషన్‌ను యూఎస్ ముందుంచింది. అయితే, ఈ తీర్మానంలో ఉగ్రసంస్థ హమాస్ ప్రస్తావన లేకపోవడంతో భారత్ ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. ఈ తీర్మానానికి 145 దేశాలు అనుకూలంగా, 14 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. మరో 45 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి.
Israel
India
United Nations

More Telugu News