Wine Shop: విశాఖలో వైన్ షాప్ ను తగలబెట్టిన వ్యక్తి.. కారణం ఇదే..!
- షాపును మూసేస్తున్నామని చెప్పిన సిబ్బంది
- కోపంతో వైన్ షాపుకు నిప్పంటించిన మందుబాబు
- విశాఖపట్నంలోని మధురవాడలో ఘటన
మద్యం ఇవ్వలేదనే కోపంతో ఓ మందుబాబు ఏకంగా వైన్ షాపుకు నిప్పంటించాడు. మంటలు ఎగసిపడడంతో లోపల ఉన్న సరుకు కాలిపోయింది. దీంతో షాపు యజమానికి రూ.1.50 లక్షల నష్టం వాటిల్లింది. విశాఖపట్నంలోని మధురవాడలో ఆదివారం చోటుచేసుకుందీ ఘటన. పోతినమల్లయ్యపాలెం ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మధురవాడలోని ఓ వైన్ షాపుకు శనివారం రాత్రి క్లోజింగ్ టైమ్ లో మధు అనే వ్యక్తి వెళ్లాడు.
ఓ మందు బాటిల్ ఇవ్వాలని అడగగా.. టైమ్ అయిపోయింది, షాప్ క్లోజ్ చేస్తున్నామని అక్కడి సిబ్బంది చెప్పారు. దీంతో రెచ్చిపోయిన మధు.. షాపు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో షాపు సిబ్బంది మధును బెదిరించి అక్కడి నుంచి పంపించేశారు. ఆపై షాపును క్లోజ్ చేసి వెళ్లిపోయారు. ఆదివారం సాయంత్రం పెట్రోల్ క్యాన్ తో అదే షాపుకు వెళ్లిన మధు.. షాపులో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలు ఎగసిపడడంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు.
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వాళ్లు వచ్చి మంటలు ఆర్పేశారు. ఈలోగా షాపులోని ఫర్నీచర్ కాలిపోగా కంప్యూటర్, ప్రింటర్ పాడయ్యాయని ఎస్ఐ తెలిపారు. దాదాపుగా రూ.1.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని షాపు యజమాని చెప్పారు. వైన్ షాపు సిబ్బంది ఫిర్యాదుతో నిందితుడు మధును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.